Governor Jishnu Dev Verma: బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు లైన్ క్లియర్

Governor Jishnu Dev Verma

తెలంగాణలో కీలకమైన బీసీల రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వం చట్టసభల్లో ఆమోదించిన పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. అలాగే ఇప్పటివరకు ఉన్న 50శాతం రిజర్వేషన్ల పరిమితిని కూడా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లపై జీవోలు జారీ చేసింది. దీంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదకానుంది. సెప్టెంబర్ నెలాఖరు లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు వేస్తుంది.

కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీల్లో విధించిన 50శాతం రిజర్వేషన్లు ఎత్తివేస్తూ ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. అలాగే అసెంబ్లీలో పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆగస్టు 31న శాసనసభలో, సెప్టెంబర్ 1న శాసనమండలిలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం ఈ సవరణ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపింది.

దీంతో ఈ బిల్లుపై న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ తాజాగా రిజర్వేషన్లపై ఉన్న 50శాతం పరిమితిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు మరో రెండు రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. మొత్తానికి రాష్ట్రంలో కొన్ని రోజుల్లో ఎన్నికల నగారా మోగనుంది.