తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పై టీచర్ల అభ్యంతరం

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర  ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి మంగళవారం ప్రకటించారు. అయితే ఈ మూడు దశల్లో రెండో దశ ఎన్నిక తేదిని మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. రెండో దశ ఎన్నికల తేదిపై ఉపాధ్యాయులు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారు చెప్తున్న ముచ్చటేంది చదవండి.

తెలంగాణ పంచాయతీ ఎన్నికల నిర్వహణ తేదిలను మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. తెలంగాణలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల తేది జనవరి 25 ఉందని అది తమకు ఇబ్బందిగా అనిపిస్తుందంటున్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం ఉన్నందున పాఠశాలలో ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.  జనవరి 25న రెండో విడత ఎన్నికలు పెడితే గణతంత్ర దినోత్సవం ఏర్పాట్లకు ఇబ్బంది కలుగుతుందన్నారు.  రెండో విడత తేదిని సవరించి జనవరి 27 గా మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి.  పాఠశాలలో విద్యార్దులకు ఆటలపోటిలు నిర్వహించాలని ఎన్నికలు ఉంటే రెండు రోజుల ముందు నుంచే ఎన్నికల అధికారులు పాఠశాలను తమ పరిధిలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు. పిల్లలకు ఇబ్బంది కాకుండా జనవరి 27నే నిర్వహించాలని కోరారు. 

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఎన్నికల అధికారి నాగిరెడ్డి మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. జనవరి 21న మొదటి విడత, జనవరి 25న రెండో విడత, జనవరి 30న మూడో విడత ఎన్నికలు జరుగుతాయన్నారు. రెండో విడతలో 4137 గ్రామాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే అదే రోజు సర్పంచ్ ఎన్నికలు జరిగితే గణతంత్ర దినోత్సవానికి ఇబ్బందులు తప్పవని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్నికల సంఘం రెండో విడత ఎన్నికల తేదిని మార్చుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.  దీని పై ఉపాధ్యాయ సంఘం నేత స్పందించారు. ఆయన ఏమన్నారంటే

“తెలంగాణ రెండో విడత ఎన్నికల తేదిని మార్చాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం.  జనవరి 26 న గణతంత్ర దినోత్సవం సంధర్బంగా పాఠశాలలో ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. జనవరి 25న రెండో విడత ఎన్నికల పోలింగ్ ఉండడంతో ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉంటారు. దాంతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చేసుకోలేం. పాఠశాలల్లోనే పోలింగ్ ఉంటుంది కాబట్టి ఏర్పాట్లు చేయలేం. జాతీయ పర్వ దినాన్ని గుర్తు పెట్టుకొని ఎన్నికల సంఘం రెండో విడత తేదిని జనవరి 27 కు మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం.” 

షేక్ హాజీ నూరానీ, రాష్ట్ర సహ అధ్యక్షులు స్టేట్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ టి.ఎస్ .(SLTA., TS)

 

టిఆర్ఎటి ఎఫ్ గౌరవాధ్యక్షుడు  ప్రతాప్ రెడ్డి స్పందించారు ఆయన ఏమన్నారంటే 

“గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. రెండవ విడత ఎన్నికల ప్రక్రియ జనవరి 11నాడు ప్రారంభమై…. 25వ తేదీనాడు… పోలింగ్…. కౌంటింగ్… ఫలితాల ప్రకటన… ఉప సర్పంచ్ ఎన్నికతో ముగుస్తుంది. అంటే…. రెండవ విడత ఎన్నికల్లో PO లుగా, APO లుగా విధులు నిర్వహించనున్న టీచర్లు ….. 24వ తేదీనాడు ఉదయం ఎన్నికల విధులు కేటాయించబడిన గ్రామాలకు వెళ్లి…. తిరిగి… 25 నాడు… ఏ అర్థరాత్రి వరకో తమ తమ ఇళ్లకు చేరుకుంటారు. మరుసటి రోజు…. 26 జనవరి ఉదయమే అన్ని స్కూళ్లల్లో రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహించాలి.

మరి, 23 వ తేదీ సాయంత్రమే స్కూలు నుంచి వెళ్లిపోయి…. ఎన్నికల డ్యూటీ ముగించుకొని 25 నాడు… ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుకునే టీచర్లు…. రిపబ్లిక్ డే ఉత్సవాలకు స్కూళ్లల్లో ముందస్తు ఏర్పాట్లు చేసుకునేది ఎలా? సకాలంలో స్కూలుకు హాజరయ్యేది ఎలా?  పోనీ, ఒకరిద్దరు టీచర్లను ఎన్నికల విధుల నుంచి మినహాయించారా? అంటే అదీ లేదు. హెచ్ఎంతో సహా టీచర్లందరికీ ఎలక్షన్ డ్యూటీస్ వచ్చాయి.

ఎక్కడన్నా టీచర్లకు ఎన్నికల డ్యూటీ రాకపోయినా…. మెజారిటీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది పాఠశాలల్లోనే! 24th నాడు ఉదయమే ఎలక్షన్ అధికారులకు స్కూలును అప్పగించాల్సిందే. ఏరకంగా చూసినా…. రెండవ విడత ఎన్నికల తేదీ… రిపబ్లిక్ డే ఉత్సవాల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఎన్నికల షెడ్యూలు విడుదల చేయడం విస్మయం కలిగిస్తోంది. “

-ఎం.ప్రతాపరెడ్డి, TRTF  రాష్ట్ర గౌరవాధ్యక్షుడు