కరీంనగర్ లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సమరభేరి సభలో పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసే దిశగా ప్రతి నియోజకవర్గ కార్యకర్తలతో సన్నాహాక కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం కరీంనగర్ లో సమావేశం నిర్వహించారు. ఇందుకు ముఖ్య అతిధిగా కేటిఆర్ హాజరయ్యారు. అయితే కేటిఆర్ కు స్వాగతం పలికేందుకు స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టారు. పిల్లలు కేటిఆర్ వచ్చేంత వరకు మండుటెండలో నిలబడ్డారు.
గతంలో హారితహారం కార్యక్రమం నిర్వహించినప్పుడు కూడా పిల్లలను రోడ్ల మీద నిలబెట్టడం పై విమర్శలు వచ్చాయి. ఇక ఏ కార్యక్రమానికి కూడా పిల్లలను తీసుకురావద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయినా నాయకులు బుధవారం కరీంనగర్ లో నిబంధనలను మర్చి చిన్నారులను ఇబ్బంది పెట్టారు. దీనికి అధికారులు ఏం సమాధానం చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పిల్లలను ఇబ్బంది పెట్టడం పై విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయ సభల కోసం చిన్నారులను ఎలా తీసుకెళతారని ప్రశ్నించారు. కేటిఆర్ దీనికి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.