త్వరలోనే మరో కాంగ్రెస్ సీనియర్ నేత అరెస్టు?

మరో పాత కేసు తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ నాయకుడిని గంజాయి కేసులో ఇరికించడం కోసం సుదర్శన్ అనే కాంగ్రెస్ కార్యకర్త సాయం కోరిన వేళ… మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు బెదిరించారంటూ గతంలో కేసు నమోదు కాగా, ఇప్పుడా కేసులో స్వర నివేదిక ఇవ్వాలంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులను పోలీసులు కోరారు.

పెద్దపల్లి జిల్లా ఓడేడుకు చెందిన కిషన్ రెడ్డి అనే తెలంగాణ రాష్ట్ర సమితి నేతను గంజాయి కేసులో ఇరికించాలంటూ, సుదర్శన్ కోరుతుండగా, అందుకు ప్లాన్ చేద్దామంటూ శ్రీధర్ బాబు వ్యాఖ్యానించిన ఆడియో గతంలో సోషల్ మీడియాకు ఎక్కి వైరల్ అయింది. అయితే, ఈ ఆడియోలో వినిపిస్తున్న గొంతు శ్రీధర్ బాబుదేనా? అన్న విషయం మాత్రం ఇంకా తేలలేదు. ఇప్పుడు తాజాగా, ఈ విషయమై హైదరాబాద్ పోలీసులు మరోసారి రిపోర్టు కోరడంతో ఎన్నికల వేళ మరో పాతకేసు తెరపైకి వచ్చినట్లయింది.

వరుసగా కాంగ్రెస్ నేతల పాత కేసులు తోడుతుండటంతో అధికార పార్టీ కావాలనే కక్షతో ఇలా చేస్తుందని పలువురు నేతలు మండి పడుతున్నారు. జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి , కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు. వరుసగా కాంగ్రెస్ నేతల పై దాడులు చేయడంతో కాంగ్రెస్ ను ఉక్కిరి బిక్కిరి చేయాలని టిఆర్ ఎస్ భావిస్తోందని, ఎన్ని కేసులు పెట్టినా, దాడులు చేసినా నిప్పు కణికలా నేతలంతా బయటికొస్తారని పలువురు కాంగ్రెస్ నేతలన్నారు. శ్రీధర్ బాబును కూడా త్వరలో విచారించనున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. పోలీసు అధికారులు కూడా ఈ కేసు విచారణను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.