టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో కోల్డ్ వార్ నడుస్తుందని తెలుస్తోంది. కేటీఆర్, కవిత మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని, ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్ కూడా ఏమి చేయలేకపోతున్నారని, అందుకే పాలనలో ప్రక్షాళనకు సిద్దమైన గులాబీ బాస్.. ఇప్పుడా ప్రయత్నాలను విరమించుకున్నారని సమాచారం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ .. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. కీలకమైన మున్సిపల్, కమర్షియల్, ఐటీ శాఖల మంత్రిగా ఉన్న కేటీఆర్.. పాలనలో అంతా తానే వ్యవహరిస్తున్నారనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. షాడో ముఖ్యమంత్రిగా విమర్శలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలని కేసీఆర్ భావించారట. అయితే తన పదవిపై క్లారిటీ ఇవ్వాలని కవిత కోరుతుండటంతో ఇంట్లో గొడవ జరుగుతుందని తెలుస్తోంది.
2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు కల్వకుంట్ల కవిత. ఆ సమయంలోనే మోడీ ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుందని, కవితకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగింది. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎవరొచ్చినా కవితకు కేబినెట్ బెర్త్ ఖాయమనుకున్నారు. కాని అనూహ్యాంగా ఆమె ఎంపీగా ఓడిపోయారు. దీంతో షాకైన కవిత.. దాదాపు ఏడాది పాటు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. దీంతో కవితను రాజ్యసభకు పంపించి అవసరమైతే కేంద్ర కేబినెట్ లో చేరుస్తారని చర్చ జరిగినా.. అది కూడా జరగలేదు. కేటీఆర్ వ్యతిరేకించడం వల్లే కవితను రాజ్యసభకు పంపలేదని టీఆర్ఎస్ లోనే చర్చ జరిగింది. కవిత కేంద్ర మంత్రి అయితే .. తర్వాత సీఎం రేసులో ఆమె తనకు పోటీగా వస్తారని భావించడం వల్లే కేటీఆర్ ఆమెకు మద్దతు ఇవ్వలేదనే ప్రచారం జరిగింది.
ఇటీవలే నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించింది కవిత. ఆమె ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఖాయమన్న చర్చ మొదలైంది. ఇక్కడే కేసీఆర్ కుటుంబంలో అసలు సమస్య వచ్చిందంటున్నారు. ఇప్పటికే కేసీఆర్ కుటుంబానికి పదవులన్ని ఇచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సమయంలో కవితను కేబినెట్ లోకి తీసుకుంటే మరిన్ని ఇబ్బందులు వస్తాయని కేసీఆర్ తో కేటీఆర్ వాదిస్తున్నారని చెబుతున్నారు. దీంతో కవితకు మంత్రివర్గంలో చోటుపై ఎటూ తేల్చుకోలేకపోతున్న కేసీఆర్.. కేబినెట్ ప్రక్షాళనకు వెనుకంజ వేస్తున్నారని భావిస్తున్నారు. తనకు మంత్రిపదవి రాకుండా కేటీఆరే అడ్డుకుంటున్నారన్న భావనలో ఉన్న కవిత.. ఇప్పుడు ముఖ్యమంత్రి సీటు విషయంలో ఏకీభవించట్లేదని సమాచారం.