షాకింగ్ న్యూస్… టిఆర్ఎస్ మీటింగ్‌కు  డిఎస్

టిఆర్ ఎస్ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న పార్లమెంటరీ, శాసనసభ, పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి రాజ్యసభ సభ్యుడు డీఎస్ హజరయ్యారు. సమావేశానికి డిఎస్ హాజరు కావడంపై అంతా ఆశ్యర్యానికి  గురవుతున్నారు. గత కొన్ని నెలల నుంచి డిఎస్ కి కేసీఆర్ అపాయిట్ మెంట్ ఇవ్వలేదు. డిఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. వాటన్నింటిని పటా పంచలు చేస్తూ శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశానికి హాజరు కావడం చర్చనీయాంశమైంది.

డిఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని నిజామాబాద్ ఎంపీ కవిత.. నిజామాబాద్ జిల్లా ప్రతినిధులతో సమావేశమయ్యి డిఎస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సభ్యులందరి తీర్మాన లేఖను కేసీఆర్ కు అందజేశారు. డిఎస్ టిఆర్ ఎస్ లో ఉంటూ తన కొడుకుల రాజకీయ భవిష్యత్తు కోసం బిజిపి, కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉంటున్నారని వారు ఆరోపించారు. సభ్యుల లేఖపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కేసీఆర్ డిఎస్ ఇష్యూను పెండింగ్ లో పెట్టేశారు.

ఆ తర్వాత డిఎస్ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు అపాయిట్ మెంట్ అడిగినా అతనికి అపాయిట్ మెంట్ దొరకలేదు. దీంతో సీఎం ఢిల్లికి వెళ్లినప్పుడు డిఎస్ సమావేశమయ్యారని వార్తలు వచ్చాయి. కానీ ఇందులో స్పష్టత లేదు. ఆ తర్వాత డిఎస్ కొడుకు సంజయ్ శాంకరీ కళాశాల విద్యార్థినిలను వేధిస్తున్నాడని కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం డిఎస్ కొడుకు లైంగిక వేధింపుల కేసులో జైలు పాలయ్యాడు. మొత్తానికి గత 3 నెలల నుంచి డిఎస్ ఇరకాటంలో పడ్డారు. టిఆర్ ఎస్ తో డిఎస్ బంధం ఇక తెగినట్టే అని అంతా అనుకున్నారు.

అందరి అనుమానాలను పటా పంచలు చేస్తూ శుక్రవారం టిఆర్ ఎస్ భవన్ లో జరిగిన సమావేశానికి డీఎస్ హాజరయ్యారు. అందరు సభ్యుల లాగే పార్టీ ఆదేశాల మేరకు డిఎస్ హాజరయ్యారని తెలుస్తోంది. దీంతో డిఎస్ బంధం టిఆర్ ఎస్ తోనే కొనసాగుతుందని స్పష్టమవుతుందని పలువురు నేతలు అంటున్నారు. డిఎస్ పై ఎటువంటి చర్య తీసుకున్నా అది ప్రతిపక్షాలకు అవకాశం గా మారుతుందని, ఒక బిసి నేతను అవమానించారనే తప్పుడు ప్రచారం జరుగుతుందని అందుకే డిఎస్ విషయంలో కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా పలువురు అంటున్నారు. మొత్తానికి డిఎస్ హాజరుతో అందరికి ఒక క్లారిటి వచ్చినట్టు అర్ధమవుతుంది. మరీ భవిష్యత్తులో ఏం జరగనుందో అనే చర్చ మొదలైంది.