టిఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా చేసి 24 గంటలు గడువక ముందే తాజా మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల వేళ టిఆర్ఎస్ కు షాక్ మీద షాక్ తగులుతుంది. ఒక పక్క సీఎం సహా అభ్యర్ధులందరూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంటే పార్టీలో కీలకంగా ఉన్న నేతలంతా ఒక్కొక్కరు రాజీనామాలు చేస్తున్నారు.
వికారాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవ్ రావు టిఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలో చాలా కాలం నుంచి వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి నిధులు ఇవ్వలేదని నిధులు రాకుండా తానేలా అభివృద్ది చేయగలనని ప్రశ్నించారు. మంత్రి మహేందర్ రెడ్డికి ఎన్నో సార్లు చెప్పినా కూడా కనీసం పట్టించుకోలేదన్నారు.
నిధులు రాకుంటే తాను పనులు ఎలా చేపడుతానని ప్రశ్నించారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనే సాకుతో తనకు టికట్ కేటాయించకుండా అన్యాయం చేశారన్నారు. తనకు పార్టీలో కూడా సరైన గుర్తింపు ఇవ్వకుండా అవమానపరిచారన్నారు.
వికారాబాద్ స్థానాన్ని ఈసారి మెతుకు ఆనంద్‌కు తెరాస కేటాయించడంతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సంజీవరావు వెల్లడించారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో చేరడం లేదన్నారు. వికారాబాద్ స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు సంజీవరావు తెలిపారు.
కీలక నేతలంతా పార్టీకి రాజీనామా చేస్తుండడంతో టిఆర్ఎస్ లో కలవరం మొదలైందని తెలుస్తోంది. ఓ వైపు నేతలు వెళ్లిపోయినా సమస్య లేదని పైకి చెబుతున్నా క్యాడర్ దూరమవుతుందనే భయం అగ్ర నేతల్లో ఉందని వారన్నారు. ఇప్పటికే ఓ ఎంపీ రాజీనామా చేయగా మరో ఇద్దరు ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. వీరితో పాటు మరికొంత మంది నేతలు కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది.