టిఆర్ఎస్ సంతోష్ రావు పై రాణి రుద్రమ ఫైర్

 

యువ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభ హైదరాబాద్ లో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులుగా జిట్టా బాలకృష్ణారెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా రాణి రుద్రమ ఎన్నికయ్యారు. పార్టీ కమిటీని కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ సభలో రాణిరుద్రమ కీలక ప్రసంగం చేశారు. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే చదవండి.

పుట్టింటి సోదరులైన మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన ప్రయోగం ఇవాళ జరిగింది. దేశంలో మహిళలకు రక్షణ, కనీస గౌరవం లేని సందర్భంలో ఒక రాజకీయ పార్టీ మహిళలకు గౌరవస్థానం కల్పించేందుకు ముందుకొచ్చింది. 40 శాతం పార్టీలో పదవులు కల్పించాలని యువ తెలంగాణ పార్టీ నిర్ణయించడం గొప్ప విషయం. పోటీ చేసే ప్రతి ఎన్నికల్లో 40 శాతానికి పైగా మహిళలకు ఇవ్వాలని యువ తెలంగాణ పార్టీ నిర్ణయించింది.

ఇసుక దందా చేస్తున్నరు అని కాంగ్రెస్ వాళ్లు నన్ను అంటున్నరు అని కేసిఆర్ మాట్లాడుతున్నడు. మా హయాంలో 1800 కోట్లు ఇసుక మీద ఆదాయం వచ్చింది అని జబ్జలు చర్సుకుంటున్నరు. 75వేల పుస్తకాలు చదివిన మనిషివేనా నువ్వు. నాకు మస్తు తెలివి ఉందని మాటలు చెప్పుడు కాదు. అసలు ఇసుక వ్యాపార వస్తువు కాదన్న తెలివి ముఖ్యమంత్రికి ఉందా లేదా? ఇసుక ప్రకృతి వనరు. దాన్ని వ్యాపర వస్తువుగా చూడరాదన్న సోయి ఉండాలె కదా? ఒకాయన ముఖ్యమంత్రికి మందులిస్తుంటడు. సాయం చేస్తడట. మందులిస్తడు, సాయం చేస్తడు కాబట్టే నేనొక పెద్ద పదవి ఇస్తున్న ఆయనకు అని ముఖ్యమంత్రి చెప్పిండు. ఆయన ఎవరో సంతోషో, గింతోషో ఎవరైతేంది.. ఆయనకు పెద్ద పదవి ఇచ్చిండు. ప్రజా స్వామ్యంలో మందులిచ్చి, సాయం చేసేవాళ్లకు పెద్ద పదవులిస్తరా? కేసిఆర్ మాత్రం పదవులిచ్చి బినామీలుగా పెట్టుకుని ఇసుక దందా చేయిస్తరు. ఇసుక మాఫియాలో ఎవరున్నరు? ముఖ్యమంత్రి కుటుంబసభ్యులే ఉన్నరు. ఒకే నెంబరు ప్లేట్లు పెట్టి పది లారీలు, 20 లారీలు పెట్టి ఇసుక కొట్టి జనాలను చంపుతున్నరు. సహజ సంపద ఇసుక పేరు మీద 1800 కోట్ల ఆదాయం అధికారికంగా చూపించి 18వేల కోట్లు వెనుకేసుకుంటున్నరు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని యువ తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనందరికీ స్వేచ్ఛ, సమాన హక్కులు దక్కుతాయని భావించినం. కానీ మహిళకు కేబినెట్ లో ప్రాతినిథ్యం దక్కకపోవడం అత్యంత బాధాకరం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేధావులు, మీడియా మిత్రులు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. మీరు ఏ ఉద్దేశంతో రాజకీయ పార్టీ పెడుతున్నారని. మీ కొత్త రాజకీయ పార్టీ అవసరమా అని అడుగుతున్నారు. నిజంగా అవసరమే. వందకు వంద శాతం అవసరమే. తెలంగాణలో నిరంకుశమైన పరిపాలన కొనసాగుతున్నది. ప్రశ్నించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని ప్రజా సంఘాలను అణిచివేస్తున్నది సర్కారు. మీడియాకు సైతం సంకెళ్లు వేసి భయపెట్టే పరిస్థితి ఉన్నది. ఇటువంటి సమయంలో ప్రజల కోసం ప్రశ్నించే వేదిక అవసరం. అందుకే యువ తెలంగాణ ఆవిర్భావం జరిగింది.

యువ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడుతున్న రాణి రుద్రమ

మన ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకున్నప్పుడు మనం బతకడమే అనవసరం. నిరంకుశ పాలనకు చరమగీతం పాడి స్వేచ్ఛా తెలంగాణ సాధించాలి. అన్ని వర్గాలకు సమాన హక్కులు కావాలి. కొత్త రక్తం రాజకీయాల్లోకి రావాలి. అందుకే కొత్త రాజకీయ పార్టీ అవసరం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో టిఆర్ఎస్ కు అధికారం ఇచ్చినం. మన నిధులు, నీళ్లు, మన ఉద్యోగాలు మనకొస్తాయని అనుకున్నం. మనం ఆత్మ గౌవరంతో బతుకుతామనుకున్నం. 1200 మంది ఆత్మబలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణలో వారి కుటుంబాలకు ఇవ్వాల్సిన గౌరవం, వారి కుటంబాలకు భద్రత, భరోసా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాం. ఏ యువత కోసం తెలంగాణ సాధించామో ఆ యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నది సర్కారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలేదు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారు.

ఒక్క పెన్ను సంతకంతో లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పుడేం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం.. మీ పెన్నులో సిరా ఇంకిపోయిందా? లేక మీరు చెప్పిన మాటలు మరిచిపోయిర్రా? తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు అసలే లేవా? మీరు టిఎస్పిఎస్సీ ని ఏర్పాటు చేసిర్రు. మరి వారు ఏం చేస్తున్నరు. నిద్ర పోతుర్రా? సిఎం గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు యువతను నిర్వీర్యం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా కొత్త కల్చర్ ను తెలంగాణ సమాజంలోకి తీసుకొచ్చిర్రు. మనం ఊర్లలో పోతే అన్న, అక్క, బాబాయి, చిన్నమ్మ అని పిలుచుకుంటాం. కానీ ఇవాళ కులాల కుంపట్లు పెడుతున్నారు. కుల విభజన చేస్తున్నరు. కులానికో భవన్ అంటున్నరు. గొర్లు, బర్లు ఇస్తం అని చెబుతున్నరు. వెనకటి కాలానికి తీసుకుపోతున్నరు. పిజి చదువుకున్న పోరగాళ్లు గొర్లు, బర్లు కాయాలా? చేపలు పట్టాలా? ఉన్నత చదువులు చదివినోళ్లు ఆ పనులు చేస్తరా? సిఎం సమాధానం చెప్పాలి.

యువతపైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఏంటో మనకు అర్థమైంది. మహిళకు అవకాశాలిస్తే అద్భుతమైన ప్రగతి సాధించవ్చని అన్నారు. కానీ ఎక్కడ ఇచ్చారు అవకాశాలు. తెలంగాణలో మహిళలే లేరా? బాలికల, మహిళలు, యువతుల సంక్షేమానికి ఏమైనా చేసిందా సర్కారు. బాలికలకు కనీస టాయిలెట్లు పెట్టే పరిస్థితి లేదు. సిగ్గుపడాలి తెలంగాణ సర్కారు. మహిళా సంక్షేమానికి కేటాయించిన నిధులు లేవు. డ్వాక్రా గ్రూపులకు ఒక్క పైసా నిధులు మంజూరు చేయలేదు. మహిళాశక్తిని నిర్వీర్యం చేస్తున్నారు. తెలంగాణ మహిళలందరినీ అవమానించే సందర్భం ఏదంటే స్త్రీ శిశు సంక్షేమ శాఖకు మహిళకు అవకాశం ఇవ్వకపోవడం. స్త్రీ శిశుసంక్షేమ శాఖను నిర్వహించే అర్హత కలిగిన ఒక్క మహిళ కూడా తెలంగాణలో లేదా? మగాయనకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అప్పగించారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని వ్యక్తిని మీ పార్టీలోకి తీసుకుని స్త్రీ శిశు సంక్షేమ శాఖను కట్టబెట్టారు. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కావొచ్చుగాక. మీ స్నేహితుడు అన్న కారణంగా ఆయనకు మహిళా శాఖను అప్పగించారు. ఈ చర్య యావత్ తెలంగాణ మహిళా లోకానికి జరిగిన అవమానంగా భావిస్తున్నది యువ తెలంగాణ పార్టీ. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇవాళనైనా మహిళలకు జరిగిన అన్యాయాన్ని సరి చేయండి.

యువ తెలంగాణ ఆవిర్భావ సభలో మాట్లాడుతున్న పార్టీ అధినేత జిట్టా బాలకృష్ణారెడ్డి

కోటి ఎకరాల మాగాణి అన్నరు. నీళ్లు వస్తయన్నరు. కానీ ఎన్ని ఎకరాలకు ఇచ్చిర్రు. రైతుబంధు పేరుతో ఎన్ని ఎకరాలకు డబ్బులు ఇచ్చిర్రో లెక్క ఉందా? హరిత తెలంగాణ అని మాటలు చెప్పిర్రు. ఏది చేయలేక, చేతగాక మళ్లీ ఎన్నికలకు పోతున్నారు. ఏం మొహం పెట్టుకుని ఓట్లకోసం వస్తారో చూస్తాం. నీళ్లు ఇయ్యరు. సబ్సిడీలు ఇయ్యరు. దళారుల వ్యవస్థను నిర్మూలించరు. మార్కెట్లో రైతుకు గిట్టుబాటు ధర రాదు. ఏది చేయరు. మొత్తం వ్యవస్థను నాశనం చేశారు. రైతుబంధు, రైతుబీమా పేరుతో జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఏమైనా బిచ్చగాళ్లా? సబ్సిడీ, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే నీ నాలుగు వేలు కాదు ఎకరాలకు పదివేలు సంపాదిస్తరు.

ప్రతి తెలంగాణ బిడ్డ కూడా దుక్కించే విషయం, తెలంగాణ ప్రజలు బాధపడే విషయం మరొకటి ఉంది. నందమూరి హరికృష్ణ అగ్ర సినీ నటుడు కాదు, అగ్ర రాజకీయ నాయకుడు కాదు కానీ ఆయన చనిపోతే 450 గజాల స్థలాన్ని కేటాయిస్తడు. స్మారక స్థూపం కడతాడట. కేసిఆర్ అయ్య జాగీరా? తెలంగాణ భూమి? లేక నందమూరి హరికృష్ణ అయ్య జాగీరా.? తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా తన ఆశ, శ్వాసగా జీవించిండు జయశంకర్ సారు. తెలంగాణ వచ్చే వరకు పోరాడిండు. కానీ ఆయనకు స్మారక స్థూపం కట్టాలన్న ఆలోచన  ఇప్పటివరకు చేయలేదు. ట్యాంక్ బండ్ మీద సార్ స్థూపం పెట్టాలన్న జ్ఞానం లేదు నీకు. జయశంకర్ సార్ ను పట్టించుకోకుండా ఆంధ్రా సినిమా రాజకీయ నేతలకు స్మారకం కట్టాలన్న నిర్ణయాన్ని యువ తెలంగాణ తీవ్రంగా ఖండిస్తున్నది.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా ముందు ఏదైతే చెప్పిండో స్మారక స్థూపాన్ని కట్టాలన్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు స్థూపం కట్టనియ్యం. సర్కారు మెడలు వంచుతాం. అసలు ఆయన సమైక్యవాదం కోసం ఎంపి పదవికి రాజీనామా చేసిండు. తెలంగాణకు వ్యతిరేకంగా కొట్లాడిండు. కానీ ఆయన మీద కేసిఆర్ కు ఎందుకు అంత ప్రేమనో చెప్పాలి. ఆంధ్రోళ్ల ఓట్ల కోసమేనా? కేసిఆర్ కుయుక్తులు. ఆంధ్రోళ్ల ఓట్ల కోసం ఆంధ్రోళ్లను కౌగిలించుకుని వారికి భూములు ధారాదత్తం చేసే ప్రయత్నం చేస్తే సహించం.

కొత్తపల్లి జయశంకర్ సార్ స్మారకఘాట్ ను నిర్మించేందుకు కేబినెట్ లో తక్షణమే నిర్ణయం తీసుకుని ఆమోదముద్ర వేయాలి. హరికృష్ణ శవం లేపకముందే స్మారక స్థూపం ప్రకటించారు. మీరు చేయకపోతే జయశంకర్ సార్ స్మారక స్థూపం ప్రకటన రాకపోతే ఈనెల 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. అన్ని రాజకీయ పార్టీలను కలుస్తాం. ప్రజా సంఘాలను ఏకం చేస్తం. మేమే జయశంకర్ సార్ స్మారక స్థూపం కడతాం. అక్టోబరు 7వ తేదీన చలో ట్యాంక్ బండ్ పేరుతో ఊరికో ఇటుక తెచ్చి జయశంకర్ సార్ స్థూపం ఏర్పాటు చేస్తాం. అదే ఒక రెడ్డి, ఒక వెలమ, ఒక కమ్మాయన చనిపోతే ఇట్లనే చేస్తరా? కమ్మ కుల ఓట్ల కోసమే కదా? ఇవాళ హరికృష్ణకు స్మారక స్థూపం అంటున్నారు. జయశంకర్ సార్ ఒక బిసి వ్యక్తి కాబట్టే కదా? సార్ స్మారకం గురించి పట్టించుకోలేదు. ప్రతి ఊరి నుంచి ఇటుక తెచ్చి ట్యాంక్ బండ్ మీద మేమే స్మారక స్థూపం ఏర్పాటు చేస్తాం.

యువతకు, మహిళలకు తెలంగాణలో కావాల్సింది ఏమిటి? అనేదానిపై తెలంగాణ అంతటా నిరుద్యోగ సర్వే చేయదలుచుకున్నాం. వందకు వంద శాతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం. అసెంబ్లీ, పార్లమెంటు, లోకల్ బాడీ ఎన్నికలతోపాటు శాసనమండలి ఎన్నికల్లోనూ పోటీ చేస్తాం. ఏ ఎన్నిక జరిగినా అందులో 40 శాతం మహిళకు టికెట్లు ఇస్తాం. అవసరమైతే 50 శాతం కూడా టికెట్లు ఇస్తాం. అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. నేను టివి కార్యక్రమం ద్వారా రాష్ట్రమంతా తిరిగి చూసిన. ఏం జరుగుతుంది? యువతకు అంటే ఉద్యోగాలు లేవు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం డెవలప్ అయిందంటే? హైదరాబాద్ లో పబ్బు కల్చర్ డెవలప్ అయింది. సిగ్గు పడాలి. తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత 100 పబ్బులు వచ్చినవి. అవన్నీ ముఖ్యమంత్రి గారి కుటుంబానివే. డ్రగ్స్ మాఫియా నడుస్తున్నది. ముఖ్యమంత్రి కుటుంబసభ్యులే డ్రగ్ మాఫియా నడుపుతున్నరు. లేకపోతే ఇంతవరకు ఏం చర్యలు తీసుకోలేదు. ఎందుకు? వీరి భాగస్వామ్యం ఉంది కాబట్టే. నయీమ్ ను ఎన్ కౌంటర్ చేసిర్రు. మరి ఆ డబ్బు ఏమైంది? అయితే నయీం సుద్దపూస అయినా కావాలి. లేకపోతే దొంగ అయినా కావాలి. కానీ ఆ ఫైల్ ఏమైంది? దానిపై ఏం చర్యలు తీసుకున్నారో తేలలేదు.

ప్రగతి నివేదన సభ పెట్టిర్రు. ప్రగతి నివేదన సభ ద్వారా 300 కోట్లు పంచిర్రు. 25 లక్షల మందితో చరిత్ర తిరగరాస్తున్నం. తెలంగాణ చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే గింత నీచమైన సభ జరిగి ఉండదు. ముందు రోజు నుంచే తాగుడా? ఇది తాగుడు సభనా? ముందురోజే తాగి సభకాడ పడుకున్నరు. అది చూసి ఏం చెప్పాలో కేసిఆర్ కు సమజ్ కాలేదు. లిక్కర్ దందా పెరిగింది తెలంగాణలో.

ఏదైతే తెలంగాణను నాశనం చేస్తుందో ఆ రంగాల్లో పురోగతి లభించింది. సమసమాజ స్థాపన జరిగే తెలంగాణ కావాలి. అన్ని కులాలు, మతాలకు సమాన హక్కులు రావాలి. ప్రజా సంఘాలకు, మీడియాకు స్వేచ్ఛ కావాలి. మీడియా వాళ్లు ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకోవాలి మీకు. ఇండ్ల స్థలాలు ఇస్తనంటిరి? ఆరోగ్య బీమా అంటిరి యాడబోయింది.? నీకు అనుకూలంగా రాయాలి. లేదంటే తీగలు కత్తిరిస్తారు. యువ తెలంగాణ ప్రశ్నించే గొంతుగా మారబోతున్నది. తెలంగాణ ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా యువ తెలంగాణ పనిచేస్తదని చెబుతున్నాం. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన సమసమాజ తెలంగాణ స్థాపన దిశగా ప్రయత్నం చేస్తాం.