యువతెలంగాణ పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకోనున్నట్టు తెలుస్తోంది. జిట్టా బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన కొంత కాలం క్రితమే యువ తెలంగాణ పార్టీ ఏర్పడింది. తెలంగాణలో ఏర్పడ్డ నిరంకుశ పాలనకు స్వస్తిపలకడమే ధ్వేయంగా ఈ పార్టీ ఏర్పడింది.
తెలంగాణ ఎన్నికలలో పోటి చేయాలనుకున్న యువతెలంగాణ పార్టీ ముందుగా మహాకూటమితో జతకట్టాలనుకుంది. కానీ మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ టిడిపికి తప్పా మిగిలిన పార్టీలకు అంతగా విలువివ్వకపోవడంతో యువ తెలంగాణ పార్టీ వారితో సంప్రదింపులు జరపలేదు. ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటి చేయాలనే ఆలోచన చేశారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సమయం పట్టనుండడంతో బిజెపితో పొత్తు పెట్టుకోవాలని యువతెలంగాణ పార్టీ నాయకులు నిర్ణయించారు.
గురువారం ఉదయం బిజెపి సీనియర్ నేత దత్తాత్రేయ, అధ్యక్షులు లక్ష్మణ్ తో యువతెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ చర్చలు జరిపారు. యువతెలంగాణ పార్టీ 10 సీట్లను కోరుతోంది. బిజెపి ఇప్పటికే 77 స్థానాలకు అభ్యర్దులను రెండు విడతలుగా ప్రకటించింది. అయితే యువ తెలంగాణ పార్టీ కోరుతున్న 10 సీట్లలో బిజెపి ప్రకటించిన సీట్లు కూడా ఉన్నాయి.
బిజెపి యువ తెలంగాణ పార్టీ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బిజెపి ప్రకటిచింన సీట్లు ఉండటంతో వాటి పైనే సంధిగ్దత నెలకొన్నది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు యువ తెలంగాణ, బిజెపి నేతలు జాయింట్ ప్రెస్ మీటింగ్ లో దీనిని ప్రకటించనున్నారు.
తెలంగాణలో ఇప్పటికే మహాకూటమి ఏర్పాటు కావడంతో రాజకీయాలన్ని రసవత్తరంగా మారాయి. ఈ సమయంలో మరో కూటమి ఏర్పాటు కానుండడంతో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కనున్నాయి. సీట్ల సర్దుబాటు పై కూడా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టు తెలస్తోంది. యువ తెలంగాణ పార్టీ బిజెపి ప్రకటించిన స్థానాలు కోరడంతో వాటి పైన ఎలా చేయాలనే దాని పై నేతలు సుధీర్ఘంగా చర్చించారు. అక్కడ ఇప్పటికే ప్రకటించిన బిజెపి నేతలు తప్పుకునే అవకాశం లేకపోవడంతో ప్రకటించని స్థానాల్లోనే 10 సీట్లు తీసుకోవాలని బిజెపి నేతలు యువ తెలంగాణ నేతలకు తెలిపారు.
తెలంగాణలో మహాకూటమికి పోటిగా బిజెపి, యువ తెలంగాణ పార్టీల కూటమి ఏర్పడబోతుంది. ఇప్పటి వరకు కూడా బిజెపి ఒంటరిగానే పోటి చేయాలని భావించింది. మహాకూటమి ఏర్పాటుతో తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. బిజెపి నేతలు తెలంగాణ జనసమితి అధినేత కోదండరాంను పొత్తు విషయమై సంప్రదించారు. కానీ వామపక్ష భావజాలం ఉన్న కోదండరాం బిజెపితో జట్టు కట్టేందుకు అంగీకరించలేదు. కాంగ్రెస్ తోనే కేసీఆర్ ను ఓడగొట్టడం సాధ్యమని ఆయన భావించారు. బిజెపి టిఆర్ ఎస్ తో లోపాయికారీ ఒప్పందం చేసుకుందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన బిజెపితో కలవలేకపోయారు.
యువ తెలంగాణ పార్టీ నేతలు కూటమిగా కలుద్దామనే ప్రతిపాదనతో బిజెపి నేతలతో చర్చలు జరిపారు. సీట్ల పంపకాల పై కూడా త్వరలోనే తేల్చి అభ్యర్దులను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. యువ తెలంగాణ పార్టీ నుంచి పోటి చేయబోయే అభ్యర్దుల వివరాలు, స్థానాల వివరాలను ఇప్పటికే బిజెపికి యువ తెలంగాణ నేతలు అందజేసినట్టు సమాచారం. దీంతో బిజెపి, యువ తెలంగాణ పార్టీలు కూడా ప్రచార హోరు పెంచనున్నారు.