ఎమ్మెల్సీ బరిలో ‘యువ తెలంగాణ’ రాణి రుద్రమ ???

తెలంగాణ రాజకీయ తెర మీదకు తాజాగా దూసుకొచ్చింది యువ తెలంగాణ పార్టీ. యువత, మహిళలకు రాజకీయ ప్రాధాన్యం కలిపించే దిశగా ఈ పార్టీ నిర్మాణం జరుగుతున్నది. పార్టీ అధ్యక్షులు గా జిట్టా బాలకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ గా ప్రముఖ టివి జర్నలిస్టు రాణి రుద్రమ ఉన్నారు. ప్రస్తుతం పార్టీ నిర్మాణం దిశగా కసరత్తు చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల్లో పోటీకి యువ తెలంగాణ సై అంటున్నది. పొత్తుల విషయంలోనూ చర్చలు జరుపుతున్నది.

ఈ పరిస్థితుల్లో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రాణి రుద్రమ ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఆమె పోటీ ఎక్కడినుంచి అన్నది ఇంకా తేలలేదు. ఆమె పుట్టినిల్లు అయిన నర్సంపేట లో పోటీ చేయవచ్చన్న ప్రచారం సాగింది. అయితే నర్సంపేట లేదంటే జిహెచ్ఎంసి పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గంలో ఎంపి లేదా ఎమ్మెల్యే సీటుకు పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

ఇదంతా కాదని రాణి రుద్రమ రూట్ మార్చినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఎంపి, ఎమ్మెల్యే సీట్లలో పోటీ కంటే ఎమ్మెల్సీ సీటుకు పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్న కోణంలో ఆమె తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జనరల్ ఎలక్షన్స్ కంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే సునాయాసంగా విజయం సాధించవచ్చని ఆమెకు పలువురు సన్నిహితులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె కూడా సమాలోచనలు చేస్తున్నారు.

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చి 29వ తేదీతో ప్రస్తుత శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్, టిఆర్ఎస్ శాసనమండలి విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, పూల రవీందర్ పదవీ కాలం ముగిసిపోనున్నది. వీరిలో స్వామి గౌడ్ గ్రాడ్యూయేట్స్ కోటాలో ఎన్నిక కాగా పాతూరి సుధాకర్ రెడ్డి, పూల రవీందర్ ఇద్దరూ టీచర్స్ కోటాలో ఎన్నికయ్యారు. వీరి స్థానాల్లో ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణకు నోటిఫికేషన్ జారీ చేసింది.

స్వామి గౌడ్ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గం నుంచి పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి పాతూరి సుధాకర్ ఉపాధ్యాయుల కోటాలో ఎన్నికయ్యారు. ఇక పూల రవీందర్ మాత్రం వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.  వీరంతా పార్టీ గుర్తులతో ఎన్నిక కానప్పటికీ టిఆర్ఎస్ ఎమ్మెల్సీలుగానే కొనసాగుతున్నారు. 

యువ తెలంగాణ పార్టీ ఏర్పాటు క్రమంలో ముందస్తు ఎన్నికలు రావన్న ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన చేసిన విషయం నిజమేనని రాణి రుద్రమ ‘తెలుగురాజ్యం’ కు తెలిపారు. సెప్టెంబరులో పార్టీని స్థాపించిన తర్వాత ప్రజల్లోకి వెళ్లి తొలుత వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే పోటీ చేసి సత్తా చాటాలన్న చర్చ జరిగిందన్నారు. అయితే ఉన్నఫలంగా అసెంబ్లీ రద్దు కావడం అసెంబ్లీ ఎన్నికలే ముందుగా వచ్చే అవకాశాలు ఉండడంతో తాము అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించామన్నారు. ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్న ఆలోచన గతంలో జరిగిందని.. ఆ ప్రతిపాదన ఇంకా సజీవంగానే ఉందని ఆమె వెల్లడించారు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.

హెచ్ఎం టివి దశ దిశ నిర్వహణలో రాణి

రాణి రుద్రమ పోటీ చేస్తే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల సీటుకు పోటీ చేసే ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో రాణి రుద్రమ టి న్యూస్ అసోసియేట్ ఎడిటర్ గా ఈ జిల్లాలో పలు సమస్యలపై స్పెషల్ స్టోరీస్ కోసం పర్యటించారు. కోల్ బెల్ట్ ఏరియాలో పర్యటించి అక్కడ కార్మికుల సమస్యలను ఫోకస్ చేశారు. అంతేకాకుండా ఆమె ఇటీవల కాలంలో హెచ్ఎం టివి లో దశ దిశ కార్యక్రమం లో కూడా ఆయా జిల్లాల్లో పర్యటించారు. ఈ నాలుగు జిల్లాల యూత్ తో మంచి సంబంధాలున్నాయి. అందుకే ఈ సీటుకు పోటీ చేయాలన్న ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. 

నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలుండడం, ఆ ఎన్నికల తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శాసనమండలి ఎన్నికలు ఉండడంతో దేనికి పోటీ చేయాలన్నదానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రాణి రుద్రమ వెల్లడించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కోటా సీటులో పోటీ చేయాలని ఎక్కువ మంది తనకు సలహాలు, సూచనలు ఇస్తున్నారని తెలిపారు. అతి కొద్దిరోజుల్లోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటానని రాణి వెల్లడించారు.