ఈ ఫొటోలో కనబడుతున్న యువకులు టిఆర్ఎస్ పార్టీకి చెందినవారు. వీరంతా మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో టిఆర్ఎస్ అభ్యర్థి ఆదేశాల మేరకు డబ్బు పంపిణీ షురూ చేశారు.
అయితే వారు డబ్బు పంచుతున్న ముచ్చట పోలీసులకు ఎరుక అయింది. ఇంకేముంది… టిఆర్ఎస్ అభ్యర్థి పంపిణీ చేసిన డబ్బును పట్టుకున్నరు పోలీసులు. వారిని విచారిస్తే వారి వద్ద దొరికిన డబ్బు 99వేల 900 ఉన్నాయి.
వాటిని పోలీసులు సీజ్ చేశారు. సదరు యువకుల మీద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో. భువనగిరి టిఆర్ఎస్ అభ్యర్థి పైల శేఖర్ రెడ్డి అనుచరులే వీరు అని పోలీసులు తెలిపారు.
భువనగిరిలోని 26వ వార్డు హుసేన్ బాద్ లో డబ్బులు పంచుతుండగా పోలీసులు పట్టుకున్నారు. భువనగిరిలో కాంగ్రెస్, టిఆర్ఎస్, యువ తెలంగాణ పార్టీల అభ్యర్థులు డబ్బును వరదలా పారిస్తున్నారన్న విమర్శలున్నాయి. సీమాంధ్రలో కంటే ఎక్కువగా ఈ నియోజకవర్గంలో డబ్బు కట్టల పంపిణీ చేపట్టినట్లు గుసగుసలు వినబడుతున్నాయి.
తెలంగాణలోనే అత్యధికంగా డబ్బు పంపిణీ భువనగిరిలోనే జరిగే చాన్స్ ఉందని జిల్లా వాసులు అంటున్నారు. మరి ఇంతటి డబ్బు ప్రవాహ హోరాహోరిలో గెలిచేదెవరో? ఓడేదెవరో మరికొద్ది గంటల్లో తేలనుంది. డబ్బు బాగా పంచిన వారు గెలుస్తారా? లేదంటే జనాలకు సేవ చేస్తాడనుకున్న వారు గెలుస్తారా? జనాలు ఏ తీర్పు ఇస్తారో మరి?