కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పై ఐటి శాఖాధికారులు దాడి చేయడంతో పాటు ఓటుకు నోటు కేసులో ఉన్న ఉదయ్ సింహ ఇంటి పై కూడా అధికారులు దాడులు చేశారు. జైపూరి కాలనీలో ఉదయసింహ బంధువు రణధీర్ రెడ్డి నివసిస్తున్నారు. ఆదివారం ఉదయం తాము ఐటి అధికారులమంటూ కొంత మంది వ్యక్తులు రణధీర్ రెడ్డి ఇంట్లో చొరబడి పలు పత్రాలతో పాటు, బంగారం, నగదు, నగలు తీసుకెళ్లారు.
ఈ విషయాన్ని ఉదయ సింహాకు తెలపడంతో ఆయన వెంటనే ఐటి అధికారులకు విషయం చెప్పాడు. దీంతో తేరుకున్న ఐటి అధికారులు తాము దాడులు చేయలేదని ఎవరు చేశారో తెలుసుకుంటామని తెలిపారు. ఇది గుర్తు తెలియని దుండగుల పనే కావచ్చని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో వారు చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ సంఘటన పై రణధీర్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పై కక్ష సాధించడానికి ఒక అమాయకున్ని బలి చేస్తున్నావా కేసీఆర్… నిన్నటి వరకు రాజకీయ దాడులు, ఈ రోజు భౌతిక దాడులు చేస్తున్నావా, రణదీర్ రెడ్డిని ఎందుకు బలి చేస్తున్నావో చెప్పాలని రణధీర్ భార్య ప్రశ్నించారు. ఒక నిండు గర్భిణిని తన భర్తను ఎక్కడికి తీసుకెళ్లారో ఎందుకు తీసుకెళ్లారో తెలియక మానసిక క్షోభ అనుభవిస్తున్నానన్నారు. కేసీఆర్, కేటిఆర్ దమ్ముంటే రేవంత్ రెడ్డిని ఎదుర్కోండి అమాయకుడైన రణధీర్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆమె నిలదీశారు. రణదీర్ ఎక్కడ ఉన్నా వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఉప్పల్ లో వాహానాలు తనిఖీలు చేస్తున్న పోలీసులకు రణధీర్ రెడ్డి కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించి వదిలేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రణధీర్ ఎక్కడికి వెళ్లాడు, అసలేమైంది అనే వివరాలు తెలియాల్సి ఉంది.