ఆర్.ఆర్.ఆర్. ని మించిపోతున్న పొంగులేటి!

వైఎస్సాసీపీలోని ఎంపీలందు రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏపీలో ఉన్న ప్రతిపక్షాలు – వాటి అనుంగ మీడియా సంస్థల వల్ల కూడాకాని స్థాయిలో ఏపీ సర్కార్ పై ఆయన విమర్శలు చేస్తుంటారు. ఎక్కడ లేని లాజిక్కులు లాగుతుంటారు.. ప్రజెంటేషన్ కూడా గోదావరి వెటకారం కలగలిపి.. ఫెర్ ఫెక్ట్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఆ ఏపీ రెబల్ సంగతి అలా ఉంటే… తాజాగా తెలంగాణ అధికార పార్టీలో ఉన్న మరో రెబల్ నేత పొంగులేటి కూడా బీఆరెస్స్ ను విమర్శించే విషయంలో ఏమాత్రం తగ్గడంలేదు!

అవును… తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఇతర బీఆరెస్స్ నేతలపై ఆ పార్టీ రెబల్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతకొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తూవస్తున్నారు. ఖమ్మం పాలిటిక్స్ లో కీలక నేత అయిన పొంగులేటి.. కొంత కాలంగా బీఆరెస్స్ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతోపాటూ.. ప్రభుత్వంపై వీలుచిక్కినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో.. మరోసారి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పొంగులేటి.

“ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల పాలైంది. 5 లక్షల కోట్లు అప్పులయ్యాయి. ధనిక రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా చేసింది. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేవు. యువతకు అత్మహత్యలే దిక్కయ్యాయి. రైతులకు లక్ష రూపాయలు రుణ మాఫీ కాలేదు. దళితుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో.. దళిత బంధు పథకంతోనే తెలిసిపోయింది. దళిత బంధుకే దిక్కు లేదు.. ఇప్పుడు మళ్లీ గిరిజన బంధు అంటున్నారు. ఒక్క గ్రామంలో కూడా కనీసం 20 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టలేని పరిస్థితి.” అంటూ కేసీఆర్ సర్కార్ పై ప్రతిపక్షాలను మించి విమర్శలు చేశారు పొంగులేటి!

ఇదే సమయంలో తన భవిష్యత్ రాజకీయాలపై స్పందించిన అయాన… బీజేపీ – కాంగ్రెస్ – లేదా సొంతపార్టీ… “జెండా ఏదైనా బీఆరెస్స్ ను గద్దె దించటమే తన అజెండా” అని తన లక్ష్యాన్ని సుస్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో… బీఆరెస్స్ కు పక్కలో బల్లెంలా తయారైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇంకా ముందు ముందు కేసీఆర్ సర్కార్పై ఇంకెన్ని విమర్శలు చేస్తారో చూడాలని అంటున్నారు టి.జనాలు!