ఘట్టుప్పల్.. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడీ ఊరు పేరు తెలియని వారుండరు. ఎందుకంటే తమ ఊరిని మండలంగా ప్రకటించి రాత్రికి రాత్రి దానిని వెనుకకు తీసుకోవడం పై ఆ గ్రామస్థులు 744 రోజులుగా తమ నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. దాదాపు 2 సంవత్సరాల 15 రోజులు . అసలు ఘట్టుప్పల్ లో ఇంత వివాదం ముదరడానికి కారణాలేంటంటే..
తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పుడు ఘట్టుప్పల్ గ్రామాన్ని కూడా మండలంగా ప్రకటించారు. ఘట్టుప్పల్ గ్రామం చేనేతకు ప్రసిద్ధి. అధిక జనాభా నివాసముంటారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చండూర్ మండలం కింద ఉన్న ఘట్టుప్పల్ ను మండలంగా ప్రకటించారు. అన్ని కార్యాలయాల ఏర్పాటు కూడా చేశారు. సిబ్బందిని కూడా నియమించారు. మండలంగా ఏర్పడటంతో గ్రామస్థులు అంతా సంతోషించారు.
ఇక తెల్లారితే మండల కేంద్రం గా ప్రారంభోత్సవాలు ఉన్నాయి. ఇంతలోనే ప్రభుత్వం నుంచి పిడుగులాంటి వార్త… ఘట్టుప్పల్ ను మండలంగా చేయడం లేదు అధికారులు అంతా వెనక్కి వెళ్లి పోవాలని ఉత్తర్వులు వచ్చాయి. అంతే సంతోషించిన గ్రామస్థుల ముఖాల్లో చీకట్టు కమ్ముకున్నాయి.
మునుగోడు నియోజక వర్గంలో ఉన్న ఘట్టుప్పల్ మండలంగా ఏర్పాటు కావడాన్ని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య వచ్చిన విబేధాల కారణంగా ఆపారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ల మధ్య వచ్చిన విభేదాల కారణంతో మండల ఏర్పాటు నిలిపేశారని వారు ఆరోపిస్తున్నారు. రాజకీయ స్వార్ధం కోసం ప్రజల ఆకాంక్షను కాలరాయడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు.
రాజకీయ నాయకులు ఆపారు కదా అని ఆ గ్రామస్థులు నిశ్శబ్దంగా కూర్చోలేదు. పార్టీలను పక్కకు పెట్టారు. ఊరు ఊరంతా ఏకమయ్యి మండలం కోసం పోరాడారు. గ్రామ బంద్ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన విధంగా మండల సాధన కోసం ఘట్టుప్పల్ తో పాటు మరికొన్ని గ్రామాల ప్రజలు ఏకమయ్యి పోరాటం సాగిస్తున్నారు.
నాయకులను కలిశారు, కోర్టులకు వెళ్ళారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు గ్రామానికి వస్తే అడ్డుకొని నిరసన తెలిపారు, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినయితే ఏకంగా ఊరవతలికి తరిమారు. హైదరాబాద్ లో ఎమ్మెల్యే ఇళ్లు ముట్టడించారు. అనేక విధాలుగా మండలం కోసం పోరాడారు. పోరాటంలో పలువురి పై కేసులు కూడా నమోదయ్యాయి.
మండలం ఏర్పాటు చేస్తామన్న తేది నుంచి నేటి వరకు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. రోజుకు కొంత మంది వంతుల వారీగా ఈ దీక్షలో పాల్గొంటున్నారు. పండుగ వచ్చినా పబ్బమొచ్చినా సరే దీక్ష మాత్రం ఆపటం లేదు. దీక్ష కొనసాగిస్తూనే మండల ఏర్పాటుకు ఉన్న మార్గాలన్నింటిని వారు ప్రయత్నిస్తున్నారు. 744 రోజులుగా దీక్ష కొనసాగించడం నిజంగా మొక్కవోని సంకల్పానికి నిదర్శనమని పలువురు గ్రామస్థులను అభినందిస్తున్నారు.
తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించి కావాలని వెనుకకు తీసుకున్నారని రాజకీయ స్వలాభం కోసం కొంత మంది నేతలు చేసిన పాపమన్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి తగిన బుద్ది చెబుతామని వారు హెచ్చరించారు. మండలం సాధించే వరకు పోరాటాన్ని ఆపేది లేదని వారు స్పష్టం చేశారు.