తెలంగాణ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీపై వివాదం

తెలంగాణలో 9వేల పైచిలుకు పంచాయతీ జూనియర్ సెక్రటరీ పోస్టుల భర్తీకి శరవేగంగా కసరత్తు జరుగుతున్నది. ఈ ఉద్యోగాల భర్తీ విషయంలో పాదర్శకత లోపించినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పోస్టులను అడ్డగోలుగా అయినవాళ్లకు అమ్ముకునే కుట్రలు జరుగుతున్నాయని ఓయూ జెఎసి నేతలతోపాటు అభ్యర్థులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకేరోజు మూడు రకాల ఉద్యోగ పరీక్షలు జరిపి నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో అసలు పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియను పారదర్శకంగా జరపాలని, నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే పరీక్షలు జరపకుండా సమయం ఇవ్వాలని కోరుతూ ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్యమం షురూ కానున్నది. శనివారం ఓయూలో విద్యార్థి నిరుద్యోగుల సత్యాగ్రహం చేపట్టి సర్కారుకు గట్టి షాక్ ఇచ్చేందుకు నిరుద్యోగ అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. 

పంచాయతీ కార్యదర్శి పరీక్ష వాయిదా వేయాలంటూ ఆర్ట్స్ కాలేజీ వద్ద స్టూడెంట్ సూసైడ్ అటెంప్ట్

జూనియర్ పంచాయతీ కార్యదర్శి పరీక్ష వాయిదా వేయాలని ముక్త కంఠంతో అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు అక్టోబర్ 6న ఉదయం 11గంటలకి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద సత్యాగ్రహం ర్యాలీ నిర్వహించనున్న ఓయూ ఐక్యవిద్యార్థి సంఘాలు ప్రకటించాయి. పరీక్షను స్వచ్చందంగా బహిష్కరించాలని అభ్యర్థులకు ఓయూలో పిలుపునిచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఒకవైపు అభ్యర్థులు ఆత్మహత్యా యత్నాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా పరీక్షా కేంద్రాలు కేటాయించకుండా సహాయనిరాకరణ చేపట్టి నిరుద్యోగులకు అండగా నిలవాలని ప్రైవేటు విద్యాసంస్థల యాజామాన్యాలను కోరనున్నారు ఐక్యవిద్యార్థి సంఘాల నేతలు.

జెఎసి నేతల రెండు డిమాండ్లు ఇవే :

రాష్ట్ర వ్యాప్త అభ్యర్థులంతా రేపు ఓయూ కి తరలివచ్చి సత్యాగ్రహం ర్యాలిని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చాయి ఐక్యవిద్యార్థి సంఘాలు. నెగిటివ్ మార్కులు, జవాబు పత్రంతో పాటు ప్రశ్నాపత్రం కూడా పరీక్ష కేంద్రంలోనే ఇవ్వాలన్న నిబంధన చూస్తే కచ్చితంగా పోస్టుల అమ్మకం తప్ప మరొకటి కాదని విద్యార్థి నేతలు అనుమానిస్తున్నారు. 

ప్రశ్నాపత్రం , నఖలు OMR పత్రం పరీక్ష రాసిన అభ్యర్థులకు అందజేయాలని డిమాండ్‌ చేస్తున్న విద్యార్థి సంఘాలు. 

అభ్యర్థుల కోరిక మేరకు ఋణాత్మక మార్కుల విధానం (నెగిటీవ్ మార్కుల పద్ధతి) రద్దు చేయాలని కోరుతున్న ఐక్య విద్యార్థి సంఘాలు.

అక్టోబరు 6న ఓయు లో జరగనున్న సత్యాగ్రహం లో పాల్గొననున్న విద్యార్థి సంఘాలు, నేతలు వీరే.

నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతా రాయ్, బొబ్బిలి యుగంధర్, ల్యాగల శ్రీనివాస్ ముదిరాజ్, టివిఎస్ కోట శ్రీనివాస్ గౌడ్, సమీర్, శ్రీకాంత్, తీన్ మార్ వరంగల్ రవి, ఎస్ఎఫ్ఐ మూర్తి, మూసావీర్, ఎఐఎస్ఎఫ్ నేతలు ఆర్.ఎన్ శంకర్, రెహమాన్, ఓయూ అధ్యక్ష కార్యదర్శులు క్రాంతి, శ్రీనివాస్, పిడిఎస్ యు నాగేశ్వరరావు, రంజిత్, బిసి విద్యార్థి సంఘం అంజియాదవ్, టిజెఎస్ విద్యార్థి విభాగం నేతలు రమేష్ ముదిరాజ్, ఓరుగంటి కృష్ణ, ఎంఎస్ఎఫ్ లింగస్వామి, సుధాకర్, కొమ్మ శేఖర్, AMSA అంగరి ప్రదీప్, శ్యామ్ సూర్యం, బండినరేష్, ఎన్ఎస్ యుఐ కోట దుర్గరాజు, నాగరాజు, ఎంఎస్ఓ హబీబ్ ఖాద్రి, టివివి నజీర్, సూర్యం, డిఎస్ యు బద్రి, జనార్థన్, గిరిజన విద్యార్థి సంఘాలు అశోక్ నాయక్, సైదానాయక్, సురేష్ నాయక్ తదిరులు పాల్గొంటారు.

మరి ఈ సత్యాగ్రహం ద్వారా తెలంగాణ సర్కారు పరీక్ష పద్ధతి మార్చి పరీక్ష తేదీలు వాయిదా వేస్తుందా లేదా అలాగే కంటిన్యూ చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. అంతేకాకుండా ఒకేరోజు మూడు పరీక్షలు ఉన్నాయని నెత్తి నోరు కొట్టుకుంటున్నా పంచాయతీరాజ్ పరీక్షల నిర్వహణ సంస్థ పట్టించుకోకుండా మొండిగా పరీక్షలు జరిపి తీరుతామని మాట్లాడడం పట్ల నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారు. 

 

ఇది కూడా చదవండి

ఒయు లో విద్యార్థి ఆత్మహత్యా యత్నం (వీడియో)