తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ యువత ఉద్యోగాలకు గండికొట్టారు. అదేంటి ముఖ్యమంత్రే ఇటువంటి పనులెలా చేస్తారు? అని అనుకోకండి. ఒక్క మాటలతో అలా చేశారు మరి. వివరాలేంటో చదవండి.
ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో టీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించింది. అందులో భాగంగా కేసీఆర్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉద్యోగుల ఓట్లు రాబట్టుకోవడంలో భాగంగా సీఎం వారికి పెద్ద వరమే ఇచ్చారు. పదవీ విరమణ వయసును ఏకంగా 61 సంవత్సరాలకు పెంచారు. ఏపీలో రిటైర్మెంట్ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు చేస్తే నేనేం తక్కువా అన్నట్లు తెలంగాణ సీఎం దానిని 61 ఏళ్లకు పెంచుతానని ప్రకటించారు.
ఈ ప్రకటనతో ఉద్యోగవర్గాల్లో హర్షం వ్యక్తమవుతుండగా నిరుద్యోగులు మాత్రం ఊగిపోతున్నారు. తెలంగాణలో అసలే అంతంత మాత్రంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.. ఇక పదవీ విరమణ వయస్సును మూడేళ్లు పెంచితే వారు ఎప్పుడు రిటైర్ అవుతారు.. మాకు అవకాశాలెప్పుడు వస్తాయి అని వారు ప్రశ్నిస్తున్నారు. ‘‘ప్రతి సంవత్సరం అనేకమంది పదవీ విరమణ చేస్తున్నారు. ఆ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేపడుతున్నారు.
ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల్లేక..ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ చావలేక బతుకుతుంటే సీఎం నిర్ణయంతో తమ పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యి మీద పడింది’’ అని ఉస్మానియాకు చెందిన విద్యార్థి నేత ఒకరు వాపోతున్నారు. నిరుద్యోగ భృతి ప్రతి నెలా రూ.3,016 ఇస్తామని ఇదే వేదికపై గులాబీ బాస్ ప్రకటన కూడా చేశారు. అయితే మేము దానిని అందుకుంటూ జీవితకాలం నిరుద్యోగులుగానే మిగిలిపోవాలా అని ప్రశ్నిస్తున్నారు.
అసెంబ్లీ సాక్షిగా మాట తప్పిన టిఆర్ఎస్
ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచే సమస్యే లేదని గతంలో అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ‘‘రాష్ర్టం వచ్చాక యువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.. త్వరలో ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం.. అందుకే 58 ఏళ్లకే ఉద్యోగ విరమణ ఉంటుంది’’ అని అసెంబ్లీలో వివరించారు. కానీ ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు విలువే లేకుండా టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కొత్త పల్లవి అందుకున్నారు.
ఇదే కాదు సుమీ. వచ్చే ఎన్నికల నాటికి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ పథకం నల్లా నీళ్లు అందించకపోతే ఓట్లే అడగము అని కూడా కేసిఆర్ సవాల్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా సవాల్ చేసినారు కానీ చాలా గ్రామాల్లో భగీరథ నీళ్లు వచ్చే పరిస్థితే లేదు. కానీ ఓట్లు మాత్రం అడుగుతూనే ఉన్నారు.
ఇలా ఎందుకు మాట మారుస్తున్నారో అని యూత్ ఆలోచనలో పడ్డారు. ఎంతైనా ఇప్పుడంతా ఓట్ల రాజకీయం కదా?