తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైందనే ఊహాగానాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈటల రాజేందర్ ఖండించారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ లేదని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో కరోనా ఫస్ట్ వేవ్ కూడా తగ్గముఖం పట్టిందని తెలిపారు. కొందరు దీనిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రకమైన ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు సూచించారు. బ్రిటన్ నుంచి వచ్చినవారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపిన మంత్రి ఈటల.. వారిలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను సీసీఎంబీకి పంపించామని తెలిపారు.ఇప్పటివరకు వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఉష్ణోగ్రతలు పెరిగితే కరోనా మొదటి దశ అంతమయ్యే అవకాశం ఉందని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు.
కరోనా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే 10 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఆ తరువాత రోజుకు 10 లక్షల మందికైనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మూడు రోజుల క్రితం కొత్త రకం వైరస్ గురించి ఈటల రాజేందర్ ఊరట కలిగించే విషయం చెప్పారు. బ్రిటన్ నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్న కొత్త రకంగా కరోనా వైరస్ ప్రాణాంతకం కాదని.. ఈ కొత్త రకం వైరస్ శరవేగంగా విస్తరించే లక్షణం కలిగి ఉందని.. ప్రాణాంతకం కాదని వివరించారు. ఈ వైరస్ విషయంలో ప్రజలు భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు.