వైసీపీ ఫోకస్ పెట్టాల్సింది వాటిపైనే.!

రాష్ట్రంలో గడచిన నాలుగేళ్ళలో.. వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధీ జరగలేదన్నది విపక్షాల వాదన. అలా ఎలా.? ఏ ప్రభుత్వంలో అయినా, తక్కువో ఎక్కువో అభివృద్ధి జరిగి తీరుతుంది.

ఔను, రాష్ట్రంలో కొన్ని చోట్ల రోడ్లు బాగా లేవు. కానీ, రాష్ట్రంలో పలు చోట్ల రోడ్లు బాగుపడ్డాయ్ కదా.! ఫ్లై ఓవర్లు కట్టారు కదా.! పరిశ్రమల విషయంలోనూ అంతే. కరోనా సహా, కొన్ని కారణాల వల్ల అభివృద్ధి కాస్త తక్కువగా జరిగి వుండొచ్చు.

మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతోంది.. పోర్టుల నిర్మాణమూ జరుగుతోంది.! 2019 ఎన్నికలకి ముందు, 2019 ఎన్నికల తర్వాత పోలవరం ప్రాజెక్టు రూపురేఖలు చూస్తే తెలుస్తుంది కదా అభివృద్ధి అంటే ఏంటో.!

కానీ, వీటి విషయంలో వైసీపీ.. పెట్టాల్సిన స్థాయిలో శ్రద్ధ పెట్టడంలేదు. వైసీపీకి మీడియా, సోషల్ మీడియా బలం వుంది. ఆయా మీడియా సాధనాల ద్వారా రాష్ట్ర అభివృద్ధిని చూపించే ప్రయత్నం చేయాలి కదా.? చేస్తోందిగానీ, సరిపోవడంలేదు.

విపక్షాలు చేస్తున్న ప్రచారం మాత్రం హైలైట్ అవుతోంది. కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇస్తున్నాగానీ, వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి కనిపించాల్సిన స్థాయిలో కనిపించడంలేదు. ప్రభుత్వ ప్రకటనల్లో ఎక్కువగా వ్యక్తి పూజ కనిపిస్తోంది. అదే అసలు సమస్య.

ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రకటనల్లో, రాష్ట్ర అభివృద్ధి కనిపించాలి. సంక్షేమ పథకాలకు జరిగే ప్రచారం సంగతెలా వున్నా, పోర్టుల దగ్గర్నుంచి మెడికల్ కాలేజీల వరకు.. రోడ్ల దగ్గర్నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు.. వీటిపై ప్రచారం అవసరం.