కాస్సేపు చంద్రబాబు అనే విషయాన్ని పక్కన పెడదాం. తెలుగు రాష్ట్రాలకు హైద్రాబాద్ ఇప్పటికీ ఉమ్మడి రాజధానే. 2024 జూన్ 2 వరకు ఇది వర్తిస్తుంది. ఏమో, ఈలోగా విభజన చట్టానికి ఏమైనా సవరణలు జరిగితే.. ఇంకొన్నాళ్ళు పొడిగింపు జరుగుతుందేమో ఉమ్మడి రాజధాని వ్యవహారం.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం రాజధాని వున్నా లేనట్టే. విజయదశమి నుంచి విశాఖ వేదికగా పాలన.. అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటున్నారు. అది ఆచరణ సాధ్యమా.? విశాఖకు రాజధాని గుర్తింపు అధికారికంగా వస్తుందా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
చంద్రబాబు విషయానికొస్తే, ఏపీ రాజకీయాలతో తెలంగాణకి ఏంటి సంబంధం.? అని తెలంగాణ మంత్రి కేటీయార్ ప్రశ్నిస్తున్నారు. ఏపీలో చంద్రబాబు అరెస్టయితే, తెలంగాణలో ఆందోళనలు చేయడమేంటన్నది కేటీయార్ ప్రశ్న. లోకేష్ స్నేహితుడేనట.. పవన్ కళ్యాణ్ కూడా స్నేహితుడేనట.. వైఎస్ జగన్ కూడా స్నేహితుడేనట.. ఇదీ కేటీయార్ చెప్పిన మాట.
తెలంగాణలోనూ టీడీపీ వుంది. ఆ పార్టీ క్యాడర్, తమ అధినేత అరెస్టుకి నిరసనగా శాంతియుత ఆందోళనలు చేపడితే అది తప్పెలా అవుతుంది.? ఏపీలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం తెరచి, అక్కడ రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు.. ఏపీ రాజకీయాలు, తెలంగాణలో ఎందుకు నడవకూడదు.?
ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరుగుతాయ్.! ఈ క్రమంలో కేటీయార్, ఒకింత ఆచి తూచి వ్యవహరిస్తే మంచిదేమో.! వైసీపీకి చోటు లేదు, టీడీపీకి చోటు లేదు.. అని కేటీయార్ చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు.