తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల క్రితం తెలంగాణలోని 29 జిల్లాలకు డిసిసి అధ్యక్షుల నియామకంతో పాటు 4 నగర కమిటిలకు అధ్యక్షులను నియమించింది. అయితే డిసిసి అధ్యక్షుల నియామకంతో నేతల మధ్య అసంతృప్తులు బయటపడుతున్నాయి. నిజామాబాద్ నగర అధ్యక్ష పదవికి కేశ వేణు రాజీనామా చేశారు. తనకు డిసిసి పదవి ఇవ్వకుండా మళ్లీ నగర అధ్యక్షునిగా నియమించడం పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేశ వేణు ఇప్పటికే మూడు సార్లు నగర అధ్యక్షునిగా 9 సంవత్సరాలు పని చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా పని చేశారు. ఈ సారి డిసిసి అధ్యక్ష పదవిని ఆయన ఆశించారు. కానీ ఆయనకు డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వకుండా మళ్లీ నగర పదవికే పరిమితం చేశారు. దీంతో వేణు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. నిజామాబాద్ డిసిసి అధ్యక్షునిగా మోహన్ రెడ్డిని నియమించారు. అంతే కాకుండా జిల్లా ఇంచార్జీ బాధ్యతల నుంచి కూడా తప్పించారు. పదవికి రాజీనామా చేసిన లేఖను ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. తాను కార్యకర్తగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. కేశ వేణు నిర్ణయంతో నిజామాబాద్ కాంగ్రెస్ లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. వేణు బాటలోనే మరికొంత మంది నేతలు నడిచేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.
మరో కాంగ్రెస్ నేత అంతిరెడ్డి రాజిరెడ్డి కూడా తన పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. కోఆపరేటివ్ సంఘానికి చైర్మన్ గా ఉన్న ఆయన 30 ఏళ్లుగా పార్టీలో పని చేస్తున్నారు. డిసిసి ఉపాధ్యక్షునిగా ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఆయన కూడా డిసిసి పదవిని ఆశించారు. కానీ పిసిసి నిర్ణయం పట్ల తాను అసంతృప్తి చెందానని, అందుకే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
జిల్లాలో ఇద్దరు కీలక నేతల రాజీనామాలతో పార్టీలో కలకలం నెలకొంది. ఇప్పటికే ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న వేళ మళ్లీ కీలక నేతలు రాజీనామాల పరంపర కొనసాగిస్తుండడంతో పిసిసి అంతర్మథనంలో పడినట్టు తెలుస్తోంది. ఈ నేతలను బుజ్జగిస్తారా లేదా అనేది చర్చనీయాంశమైంది.