తెలంగాణ యూత్ కోసం కొత్త రాజకీయ పార్టీ

తెలంగాణ రాజకీయ తెర మీదకు మరో కొత్త పార్టీ వచ్చి చేరనుంది. సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు కసరత్తు పూర్తయింది. యూత్ కోసమే ఈ రాజకీయ పార్టీ రానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో మెజార్టీ సీట్లు యూత్ కే కట్టబెట్టి సత్తా చాటేందుకు రెడీ అవుతున్నది కొత్త రాజకీయ పార్టీ. సెప్టెంబరు 5వ తేదీన ప్రకటించబోతున్న ఈ కొత్త పార్టీ సంగతులేంటో చదవండి. 

తెలంగాణలో ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా జనాలు ఆదరిస్తారు అనేది అనేకసార్లు నిరూపితమైంది. కేవలం 119 నియోజకవర్గాలే తెలంగాణలో ఉన్నప్పటికీ జిల్లాకొక రాజకీయ పార్టీ ఉనికిని చాటుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, టిడిపి, బిజెపి, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం పార్టీలు ఉన్నాయి. తాజాగా తెలంగాణ జన సమితి 2019 ఎన్నికల పోరుకు రెడీ అవుతున్నది.

ఎపిలో కేవలం రెండు, మూడు పార్టీలకు మించి ఉండవు. కానీ తెలంగాణ సమాజం అన్ని రాజకీయ పార్టీలను గుండెల్లో పెట్టుకుంటది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఆంధ్రా రాజకీయాల్లో అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి, మధ్యలో బిజెపి తప్ప మరో పార్టీకి అక్కడ స్థానం లేదు. కానీ 2019లో ఆంధ్రాలో జనసేన బరిలో ఉంటుంది కాబట్టి ఆ పార్టీకి కూడా సీట్లు రావొచ్చు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా సీట్లు సంపాదించుకోవచ్చు. ఇక మీదట ఆంధ్ర్రప్రదేశ్ లో కూడా బహుళ పార్టీలు తెర మీద కనబడే చాన్స్ ఉండొచ్చు.

ఇక తెలంగాణలో చూసుకుంటే యువ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాట్లు జరిగిపోయాయి. సెప్టెంబరు 5వ తేదీన పార్టీని అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ కొత్త పార్టీకి జిట్టా బాలకృష్ణారెడ్డి నాయకత్వం వహించనున్నారు. ప్రముఖ తెలుగు టివి న్యూస్ యాంకర్ రాణి రుద్రమ కూడా ఈ పార్టీలో కీలక భూమిక పోశించనున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల హడావిడి నెలకొన్న తరుణంలో యువ తెలంగాణ పార్టీని వీలైనంత తొందరగానే ఆరంభించాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే దిశగా యువ తెలంగాణ పార్టీ కసరత్తు చేస్తున్నది. మెజార్టీ సీట్లలో యూత్ కు, మహిళలకు అవకాశం కల్పించే ఉద్దేశంతో ఉన్నట్లు తెలిసింది. 

తెలంగాణలో వివిధ సెక్టార్లలో పనిచేస్తున్న అన్ని యువజన సంఘాలను సంప్రదించినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఆసక్తి ఉన్న యువజన సంఘాల ప్రతినిధులను పెద్ద సంఖ్యలో పార్టీలో చేర్చుకునేందుకు కసర్తతు చేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన విద్యార్థి నేతలను కూడా పార్టీలో చేర్చుకోనున్నట్లు తెలుస్తోంది. యూనివర్శిటీ విద్యార్థి నేతలతో ఇప్పటికే చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

దీనికితోడు మహిళలకు కూడా పార్టీలో కీలక స్థానం కట్టబెడతామని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా స్థానం లేకపోవడాన్ని రానున్న ఎన్నికల్లో గట్టిగా ప్రస్తావించే చాన్స్ ఉంది. యువ తెలంగాణ పార్టీ యూత్, మహిళల సమన్వయంతో ముందుకు సాగుతుందని అంటున్నారు 

జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 1992లో వివేకానంద యువజన సంఘం స్థాపించారు. తర్వాత 1997లో రంగారెడ్డి జిల్లా యువజన సంఘాల సమితిని ప్రారంభించారు. 2000 సంవత్సరంలో రాష్ట్రంలోని యువజన సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి యువజన సంఘాల సమితి ని ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో జిట్టా టిఆర్ఎస్,  వైసిపిలో పనిచేశారు. 2010లో యువ తెలంగాణ అనే వేదికను ఏర్పాటు చేసి దాని ద్వారా తెలంగాణ కోసం తన వంతు పోరాటం జరిపారు. అప్పటినుంచి గత ఎనిమిదేళ్లుగా యువ తెలంగాణ తరుపున ఆయన కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఈ పార్టీలో కీలక పాత్ర పోశించనున్న రాణి రుద్రమ టివి తెర మీద యాంకర్ గా సుపరిచితమే. ఆమె ఈటివి, టివి9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టిన్యూస్ ఛానెళ్లలో న్యూస్ యాంకర్ గా, సీనియర్ టివి జర్నలిస్ట్ గా పనిచేశారు. టిన్యూస్ లో అసోసియేట్ ఎడిటర్ గా పనిచేశారు. తాజాగా హెచ్ఎం టివిలో దశ దిశ అనే కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఇకపై రాణి రుద్రమ ఫుల్ టైం పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే యోచనలో ఉన్నారు. ముందస్తు వచ్చినా, 2019లో ఎన్నికలు వచ్చినా ఆమె అయితే నర్సంపేట, లేదంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

యూత్ లక్ష్యంగా ముందుకొస్తున్న ఈ రాజకీయ పార్టీని తెలంగాణ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకంటారన్నది రాజకీయ తెర మీద చూడాల్సిందే. సెప్టెంబరు 5న స్థాపితం కానున్న యువ తెలంగాణ పార్టీపై ఇప్పుడే అంచనాలు షురూ అయ్యాయి.