భర్త విగ్రహానికి దండ వేయకుండా సునితా లక్ష్మారెడ్డి అరెస్ట్ (వీడియో)

మెదక్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సునితా లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 144 సెక్షన్ పేరుతో తన భర్త విగ్రహానికి దండ వేయకుండా అడ్డుకుని అరెస్టు చేశారు పోలీసులు. ఈ సంఘటన మెదక్ జిల్లాలో సంచలనం కలిగించింది. నర్సాపూర్ కాంగ్రెస వర్గాలు అందించిన పూర్తి వివరాలు చదవండి.

నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సునితాలక్ష్మారెడ్డి భర్త వాటిక లక్ష్మారెడ్డి పంద్రాగస్టు నాడే మరణించారు. ఆయన జ్జాపకార్థం సునీత మంత్రిగా ఉన్న కాలంలో నర్సాపూర్ లో మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఎంపి నిధులు, ఇతర నిధులతో ఆ ట్రస్టు ద్వారా పేద ప్రజలకు సేవలందిస్తున్నారు. ఆ ట్రస్టులో కంటి ఆసుపత్రి రన్ అవుతున్నది. అదే ట్రస్టులో సునితాలక్ష్మారెడ్డి భర్త లక్ష్మారెడ్డి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రతి ఏడాది పంద్రాగస్టు నాడు తన భర్త విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు సునిత. ఆమెతోపాటు కుటుంబసభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

 

ఈసారి కూడా గతంలో లాగే భర్త విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించేందుకు ఆమె వెళ్లారు. అనంతరం అదే ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించనున్నారు. కానీ ఆమెను పోలీసులు భర్త విగ్రహం వద్దకు పోకుండా అడ్డుకున్నారు. పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉంది కాబట్టి ఆమె భర్త విగ్రహం వద్దకు వెళ్లడానికి వీలు లేదని అమెను, కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుని  నిర్బంధించారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సునిత బైటాయించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

ఇక మరో విషయం ఏమంటే తెలంగాణ సర్కారు అధికారంలోకి రాగానే సునితాలక్ష్మారెడ్డి ఏర్పాటు చేసిన ట్రస్టు పేరు మార్చేందుకు ప్రయత్నించింది. లక్ష్మారెడ్డి పేరు తీసేసే ప్రయత్నం చేసింది. దీంతో సునిత కోర్టుకు వెళ్లారు. న్యాయ పోరాటానికి రెడీ అయ్యారు. కోర్టు సర్కారు చర్యలకు బ్రేక్ వేస్తూ స్టే ఇచ్చింది. ట్రస్టు అనేది ప్రజల సంపద కాబట్టి లక్ష్మా రెడ్డి పేరు తొలగిస్తామని సర్కారు వాదన. అయితే ప్రస్తుతం ఆ ట్రస్టు తన భర్త పేరు మీదే ఉన్నప్పటికీ సర్వీసు మాత్రం ప్రజలకే అందుతున్నది కదా? దాని పేరు మార్చాలని చూడడం రాజకీయ వివక్ష కాదా అని సునితారెడ్డి వాదన.

ఈ నేపథ్యంలోనే ఈసారి తన భర్త వర్ధంతి సందర్భంగా పూల దండ వేసేందుకు వెళ్లగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులతో తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. సునితా లక్ష్మారెడ్డిని పోలీసులు నిర్బంధించిన సమాచారం తెలుసుకున్న గజ్వేల్ కాంగ్రెస్ నాయకుడు ఒంటేరు ప్రతాపరెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసుల వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. జరిగిన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డితో మాట్లాడారు. ఇదే పద్ధతి..? అని నిలదీశారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒంటేరు ప్రతాప్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీసులు సునితాలక్ష్మారెడ్డి తన భర్త విగ్రహానికి దండ వేసేందుకు అనుమతి ఇచ్చారు. అది కూడా కార్యకర్తలు, నాయకులతో కలిసి వెళ్లకుండా కేవలం కుటుంబసభ్యులు మాత్రమే విగ్రహం వద్దకు వెళ్లి దండలు వేయాలంటూ పోలీసులు తేల్చి చెప్పారు. పోలీసుల తీరుపై సునితాలక్ష్మారెడ్డి కంటతడి పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కనీసం తన భర్త విగ్రహానికి దండ వేసే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని కన్నీరు పెట్టుకున్నారు.

ఈ ఘటన తాలూకు వీడియో పైన, ఫొటో గ్యాలరీ కింద ఉన్నాయి చూడండి.

సునితాలక్ష్మారెడ్డి అరెస్ట్
కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలు
సునితను పరామర్శించిన ఒంటేరు ప్రతాపరెడ్డి
భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు
కాంగ్రెస్ శ్రేణుల అరెస్ట్
అంబేద్కర్ విగ్రహం వద్ద బైటాయించిన సునితారెడ్డి
గాయపడిన కాంగ్రెస్ కార్యకర్త
నర్సాపూర్ లో టెన్షన్