మళ్ళీ మనసు మార్చుకున్న నాగబాబు.!

ఓ మాట మీద నిలబడటం అస్సలు అలవాటు లేదేమో మెగా బ్రదర్ నాగబాబుకి.! ఇది సినిమాల గురించి కాదు, రాజకీయాల గురించి.! జనసేన నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, ఎన్నికల్లో పోటీ విషయమై గతంలో ‘నో’ చెప్పారు కానీ, ఇప్పుడాయన మనసు మార్చుకున్నారట.

2019 ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు నాగబాబు. అదే నియోజకవర్గం నుంచి వైసీపీ ఘన విజయం సాధించింది. అయితే, గెలిచిన ఎంపీ రఘురామకృష్ణరాజు కొద్ది కాలానికే వైసీపీకి దూరమయ్యారు. ఆయన ప్రస్తుతం వైసీపీ రెబల్ ఎంపీ మాత్రమే.!

గడచిన కొంత కాలంగా పశ్చిమగోదావరి జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది జనసేన. ఇంకోసారి నాగబాబు నర్సాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయొచ్చన్న ఊహాగానాలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి గత కొద్ది రోజులుగా. నాగబాబు అయితే ఈ విషయమై పెదవి విప్పడంలేదు.

పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో, నిత్యం పార్టీ ముఖ్య నేతలతో వర్చువల్ భేటీలు నిర్వహిస్తున్నారు.. అందుబాటులో వున్న నేతలతో ప్రత్యక్షంగానూ సమావేశమవుతున్నారు నాగబాబు. ఈ భేటీల సందర్భంగా నాగబాబు పోటీ చేయడంపై పార్టీ ముఖ్య నేతలు ఆయన్నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారట.

అధినేత నిర్ణయానికి తాను కట్టుబడి వుంటానని మాత్రమే నాగబాబు చెబుతున్నారట. మొత్తంగా 175 నియోజకవర్గాల్లోనూ పార్టీ బలోపేతం దిశగానే నాగబాబు కార్యాచరణ వుంటోందట. అయితే, అభ్యర్థుల్ని ఖరారు చేసేంత ‘పవర్’ నాగబాబుకి ఇంకా పవన్ కళ్యాణ్ ఇవ్వలేదని తెలుస్తోంది.