నరసాపురం ఎంపీ రఘురామరాజు వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఆయన పనిగట్టుకుని మరీ అధికార పక్షం నిర్ణయాలను, చర్యలను తప్పుబడుతుండటంతో పాలన వర్గం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ఎలాగోలా సమాధానం చెప్పొచ్చు కానీ ఇలా సొంత పార్టీ ఎంపీనే పక్కలో బల్లెంలా మారేసరికి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు వైసీపీ నేతలు. వైఎస్ జగన్ సైతం రాఘురామరాజు విషయంలో ఎలా స్పందించాలో అర్థంకాక తికమకపడ్డారు. నేరుగా కేంద్రంతో మాట్లాడి ఆయన మీద అనర్హట వేటు వేయాలని అనుకున్నారు. కానీ చివరకు పార్లమెంట్లో ఆయన కూర్చునే సీటును మాత్రమే వెనక్కి మార్చగలిగారు.
ఇప్పటికే అనేక అంశాల మీద ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టిన రఘురామరాజు తాజాగా మూడు రాజధానుల విషయాన్ని కూడా తీవ్రంగా నిరసించారు. అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుందని అంటూ త్వరలో రైతులకు మద్దతుగా అమరావతిలో పర్యటిస్తానని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు వంటి నిర్ణయాల వలన రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్న రఘురామరాజు కొత్త రాష్ట్రానికి ఒకే ఒక రాజధాని ఉండాలని విభజన చట్టంలో ఉందని, 5 వేల కోట్లతో అమరావతి పూర్తవుతుందని, కానీ మూడు రాజధానులు తెస్తే రైతులకు న్యాయం చేయడానికి 90 వేల కోట్లు కావాలని వ్యాఖ్యానించారు.
ఈ తరహా వ్యాఖ్యలతో ప్రభుత్వం చర్యల మీద ప్రజల్లో మరింత అపనమ్మకం ఏర్పడుతుందని భావించిన జగన్ ఇక లాభం లేదనుకుని తన పాత ఫార్ములాను ప్రయోగించారు. రామరాజు మీద ప్రతిదాడికి వైసీపీలోని ప్రముఖులను రంగంలోకి దించారు. రామరాజు వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే మీడియా ముందుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి రఘురామకృష్ణంరాజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాళ్లు పట్టుకుని ఎంపీ సీటు తెచ్చుకున్నారని, రఘురామకృష్ణంరాజు ఎవరో జనానికి తెలియదని, వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ మీదే రఘురామకృష్ణంరాజు ఎంపీగా గెలిచారని అంటూ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన పదవికి రఘురామకృష్ణంరాజు రాజీనామా చేయాలని ఛాలెంజ్ విసిరారు. మరి ఈ ఎత్తుగడతోనైనా రామరాజును జగన్ కంట్రోల్ చేయగలరేమో చూడాలి.