రాజుగారి సెక్యూరిటీ ఫోటో వైసీపీకి కౌంటర అనుకోవాలా !

MP Raghuramkrishana Raju mistake gone viral
వైసీపీ ఎంపీ రఘురామరాజుగారి వైఖరి పూర్తిగా వైసీపీకి వ్యతిరేకం అయిపోయింది.  అవకాశం చిక్కిప్పుడల్లా వైసీపీ విధానాలను ఏకిపారేసే రాజుగారు ఈమధ్య ప్రతి చిన్న విషయానికి అధికార పక్షాన్ని చెడుగుడు ఆడుకుంటున్నారు.  ఒక్కోసారి రాజుగారు లాగే లాజిక్కులు ప్రతిపక్షానికి కూడా అందవు.  ప్రత్యర్థుల కంటే ముందే ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రశ్నలు, విమర్శలు సంధిస్తుంటారు.  తాజాగా కూడా వైసీపీకి చిర్రెత్తుకొచ్చేలా ఒక వార్తను ఫోటోతో సహా బయట పెట్టారు రాజుగారు.  అదే తనకు కేంద్రం కల్పించిన వై కేటగిరీ సెక్యూరిటీని ప్రదర్శించడం.  ఈరోజే కేంద్రం అలాట్ చేసిన సెక్యూరిటీ ఢిల్లీలోని రాజుగారి నివాసంలో ఆయనకు రిపోర్ట్ చేయడం జరిగింది. 
 
ఈ సంధర్భంగా సినిమా లెవల్లో రాజుగారు సెక్యూరిటీ సిబ్బందిని చుట్టూ పెట్టుకుని ఫోటో దిగి వదిలారు.  ఈ ఫోటో ఎవరికి తగలాలో వారికే తగిలింది.  వారే వైసీపీ నేతలు.  సొంత పార్టీతో గొడవలు మొదలైన కొత్తల్లో నెమ్మదిగానే ఉన్న ఆ పార్టీ నేతలు ఆతర్వాత హైకమాండ్ ఆదేశాలతో చెలరేగిపోయారు.  నరసాపురం పరిధిలోని ఎమ్మెల్యేలే రామరాజు మీద మాటల యుద్దం స్టార్ట్ చేసి బహిరంగ దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.  నియోజకవర్గాల్లో ఆయన ధిష్టి బొమ్మలను సైతం దగ్ధం చేశారు.   ఈ చర్యతో రామరాజు భయపడ్డారో లేదో తేలీదు కానీ ఆ పరిణామాన్ని మాత్రం వాడేసుకున్నారు. 
 
నేరుగా ఢిల్లీ వెళ్ళి కూర్చుని తనకు సొంత పార్టీ నేతల వల్లనే ముప్పు ఉందని, తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎకరవు పెట్టారు.  తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు.  సొంత నియోజకవర్గంలో పర్యటనకి వెళ్లాలంటే భయంగా ఉందని, రక్షణ అవసరమని అడిగారు.  స్థాయి వ్యక్తి కావడం, ఢిల్లీ పెద్దలతో మంచి పరిచయాలు ఉండటంతో వై క్యాటగరీ సెక్యూరిటీ కేటాయించారు.  ఇందులో 11 మంది కేంద్ర బలగాలు ఉంటారు.  ఒకవేళ రామరాజుగారు రాష్ట్ర పర్యటనకు వస్తే రాష్ట్ర పోలీస్ శాఖ 10 మంది పోలీసులతో భద్రత కల్పించాల్సి ఉంటుంది.  ఇప్పటికే అమరావతిలో పర్యటనకు రామరాజు అనుమతి కోసం డీజీపీకి లేఖ రాశారు.  అనుమతి అందితే వై క్యాటగిరీ సెక్యూరిటీతో రామరాజు దర్జాగా రాష్ట్రంలో తిరిగేస్తారన్నమాట.