ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొన్ని కీలక స్థానాల్లో పోరుపై ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. అవి అటు అసెంబ్లీ స్థానాల్లోనూ, ఇటు లోక్ సభ స్థానాల్లోనూ ఉన్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి ఎవరు ప్రత్యర్థి అనే చర్చ బలంగా నడుస్తుంది. పైగా ఆయా పార్టీలు ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాయి కూడా. అలాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్ సభ స్థానం ఒకటి.
ఇప్పుడు అక్కడ వైసీపీ మినహా ఏ పార్టీ నుంచైనా బరిలోకి దిగగలనని, దిగుతానని నొక్కి చెబుతున్నారు రఘురామ కృష్ణంరాజు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ టిక్కెట్ ఇవ్వడంతో ఎంపీగా పోటీచేసి గెలిచిన ఆయన… తర్వాతి కాలంలో రెబల్ గా మారారు. దీన్నే మరికొందరు స్వపక్షంలోనే సైంధవ పాత్ర పోషిస్తున్నారని అంటుంటారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పొత్తులను బట్టి తాను ఏపార్టీలో చేరాలనేది డిసైడ్ చేసుకుంటానని చెబుతున్నారు.
కారణం… అక్కడ టీడీపీకి ఆప్షన్ లేదు! ఇలా ఐదేళ్లలో ఒక సొంత ఎంపీ అభ్యర్థిని సంపాదించుకోకుండా… వైసీపీతో విభేదించి రాజీనామా చేస్తానని మూడేళ్లుగా చెబుతున్న రఘురామ కృష్ణంరాజు వస్తే టికెట్ ఇద్దామన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తుండటం టీడీపీ క్యాడర్ కు కాస్త అసంతృప్తి ఉందనే మాటలూ వినిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా నాగబాబుకి ఇచ్చినా కాస్త గౌరవంగా ఉండేదనేది వారి అభిప్రాయంగా ఉందని తెలుస్తుంది.
నరసాపురం లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి పట్టున్నప్పటికీ… సరైన ఎంపీ అభ్యర్థిని తయారుచేసుకోవడంలో, సిద్ధం చేసుకొవడంలో బాబు పూర్తిగా ఫెయిలయ్యారూ. గాలివాటంలో వచ్చే గెలుపులపైనే ఆధారపడి రాజకీయం చేయాలని అనుకుంటున్నట్లున్నారు! ఆ సంగతి అలా ఉంటే… ఈ దఫా ట్రిపుల్ ఆర్ ను ఎట్టిపరిస్థితుల్లో ఓడించాలని బలంగా భావిస్తున్నట్లు చెబుతున్న అధికార వైసీపీ… ఆయనపైకి డిప్యూటీ సీఎంని బరిలోకి దించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
నరసాపురం ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను బరిలోకి దింపాలని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. వైసీపీ ప్రకటించబోయే ఐదవ జాబితాలో ఈ మార్పు ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఈ విషయంపై జగన్.. కొట్టుతో మాట్లాడారని అంటున్నారు. అయితే ఈ విషయంలో ఆయన జగన్ వద్ద ఒక కండిషన్ పెట్టారని సమాచారం. అందుకు జగన్ అంగీకరిస్తే… తాను రెడీ అన్నారని తెలుస్తుంది.
ఇందులో భాగంగా… తన కుమారుడు కొట్టు విశాల్ కు తాడేపల్లిగూడెం సీటిస్తే తాను నరసాపురం ఎంపీగా పోటీ చేస్తానని కొట్టు సీఎంకు చెప్పినట్లు ప్రచారం సాగుతుంది. ఏది ఏమైనా… ఈసారి ట్రిపుల్ ఆర్ ను ఓడించాలని.. మరోసారి నరసాపురం లోక్ సభ స్థానంలో వైసీపీ జెండా ఎగురవేయాలని జగన్ & కో బలంగా ఫిక్సయ్యారని మాత్రం తెలుస్తుంది. ఇదే ఫైనల్ అయితే… ట్రిపుల్ ఆర్ వర్సెస్ కొట్టు ఫైట్ ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి.