తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్ 2014లో టిఆర్ఎస్ సర్కారు కొలువుదీరిన తొలినాళ్లలో జరిగిన ఒక సంఘటనను ఇప్పుడు బయట పెట్టారు. తన తండ్రి సిఎం కేసిఆర్ దగ్గరికి తాను ఒక ఇష్యూ మీద బాధితులను తీసుకుని వెళ్తే తనకు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. మళ్లీ వాళ్ల ముచ్చట నాదగ్గరకు తెస్తే తంతా అని వార్నింగ్ ఇచ్చారని చెప్పారు.
హైదరాబాద్ లోని హోటల్ తాజ్ దక్కన్ లో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ నాల్గవ జరనల్ బాడి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కేటిఆర్ హాజరై పై కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడిన పూర్తి వివరాలు కింద చదవండి.
తెలంగాణ బిల్డర్స్ మాకు మద్దతు ప్రకటించింనందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు. 2014 లో రెండు జిల్లాలు తప్ప తెలంగాణా లో అంతటా మేమే గెలిచాం. ఖమ్మం, హైదరాబాద్ లోనే గెలవలేక వెనుకబడిపోయాం. అప్పట్లో రంగారెడ్డి జిల్లా కూడా సవాలుగా ఉండేది. టీఆరెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల్లోనే హైదరాబాద్ ప్రజలు గ్రేటర్ ఎన్నికల్లో టీఆరెస్ కు బ్రహ్మరథం పట్టారు.
ప్రజల అనుమానాలు పటాపంచలు అయ్యాయి. టీఆరెస్ సర్కార్ ఎవ్వరి పై వివక్ష చూపదని నిరూపించాం. కాంగ్రెస్ హయాంలో పాతబస్తీలో పదే పదే కర్ఫ్యూ పెట్టేది. టీఆర్ఎస్ వచ్చాక ఒక్కసారి కూడా కర్ఫ్యూ పెట్టలేదు. కిరణ్ కుమార్ రెడ్డి భయపెట్టారు. తెలంగాణ వస్తే కరెంటే ఉండదు అన్నారు. కానీ ఆరు నెలల్లోనే కరెంటు కష్టాలు తీర్చేశాము.
క్లబ్ లు మూసి వేస్తూ టిఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకున్నాక క్లబ్బుల్లో పని చేసే సిబ్బంది నా దగ్గరికి వచ్చి ఆవేదన పడ్డారు. మాకు బతుకుదెరువు పోయిందని బాధపడ్డారు. వాళ్ల సమస్య గురించి నేను వాళ్ళని తీసుకుని కేసిఆర్ వద్దకు వెళ్ళాను. మళ్ళీ వాళ్ళను తీసుకుని నాదగ్గరకు వస్తే తంతా అన్నారు.
హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ. లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. ఐటీలో మహిళలు ఎక్కువ పని చేస్తున్నారు. మహిళా భద్రతకు పెద్ద పీట వేశాము. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణా మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్ లో నీటి సమస్యను అధిగమించాం. కేసీఆర్ విజన్ సినిమా లా ఉంటుంది. కానీ ఒక దాని తరువాత మరొకటి జరుగుతుంది. హైదరాబాద్ ప్రజల నుంచి ఉన్న కంప్లైంట్ ఒక్కటే అదేమంటే రోడ్లు బాగాలేవని. రోడ్లు తవ్వి పనులు చేస్తున్నాం. 22 వేల కోట్లతో మాస్టర్ సివరేజి ప్లాన్ మెనిఫెస్టోలో కూడా పెడతాం.
2014 లో 57 వేల కోట్లు 2018 లో 94 వేల కోట్లకు చేరింది. భూములు అమ్మొద్దు. ఎన్నికలు ఉన్న విషయం జనం మరిచారు. మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతారని జనం అనుకుంటున్నారు. ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు. అందరిని మా ప్రభత్వం సంతృప్తి పరిచింది. కాంగ్రెస్ కాలంలో జీవోలు ఇవ్వాలంటే చేతులు తడపాల్సి వచ్చేది. బ్యూరోకాట్ లెవెల్ లో కొంత కరేప్షన్ ఉండొచ్చు కానీ రాజకీయ అవినీతి పూర్తిగా అంతమైపోయింది.
ఉమ్మడి రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు కూడా కరెంటు కోసం ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేసిన దాఖలాలున్నాయి. కానీ ఇప్పుడు వారు ఇందిరా పార్కు వద్ద ధర్నాలు చేయాల్సిన అవసరమే లేదు. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా తమ సర్కారు చర్యలు తీసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉంటే దివంగత నేత పిజెఆర్ కరెంటు కోసం ధర్నాలు చేస్తుండే. కాంగ్రెస్ అధికారంలో ఉంటే టిడిపివాళ్లు కరెంటు కోసం ధర్నాలు, అసెంబ్లీకి వరికంకులు తీసుకొచ్చే పరిస్థితి ఉండే. కానీ ఆరు నెలల్లోలనే పరిస్థితి మార్చేశాము.