లగడపాటికి ఇంకో సన్యాసం తప్పదు : కేటిఆర్ సెటైర్

తెలంగాణలో జరిగిన ఎన్నికలపై సర్వేల పంచాయితీలు ఇంకా సద్దుమణిగేలా కనిపించడంలేదు. తెలంగాణకు వ్యతిరేకంగా భీకర పోరాటం చేసి రాజకీయ సన్యాసం తీసుకున్న విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రస్తుతం సర్వేల పేరుతో జనాల్లో నానుతున్నారు. అయితే లగడపాటి సర్వేలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయని కొందరు అంటుంటే అవి టిఆర్ఎస్ మీద అక్కస్సుతో చేసిన సర్వేలు అని మరికొందరు అంటున్నారు. టిడిపి వత్తిడి కారణంగా లగడపాటి తన సర్వే రిపోర్టులు మార్చి చెబుతున్నారని ఇంకొందరు అంటున్నారు.

ఈ తరుణంలో లగడపాటి సర్వే వివరాలపై మంత్రి కేటిఆర్ శనివారం స్పందించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటిఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా లగడపాటి సర్వే అంశాన్ని మీడియా ప్రతినిధులు అడగగా కేటిఆర్ సమాధానమిచ్చారు. లగడపాటి పేరు తీసుకోకుండానే ఆయన సర్వేల గురించి కేటిఆర్ కామెంట్స్ చేశారు. 

‘‘లగడపాటి గతంలో తెలంగాణ రానే రాదని బల్ల గుద్ది చెప్పారు. అయినా ఆయన సర్వేలు, ఆయన జ్యోతిష్యాలు ఏమాత్రం పనిచేయలేదు. అందుకే అప్పుడు ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన (లగడపాటి) తెలంగాణలో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా సర్వేల పేరుతో మాట్లాడతుున్నాడు. ఇంకెన్ని రోజులు ఆగాల్సిన పనిలేదు. 72 గంటలు ఆగితే ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగానే సర్వే సన్యాసం కూడా తీసుకోబోతున్నారు. మీరు అది చూడబోతున్నారు.’’ 

వంద సీట్లతో మళ్లీ టిఆర్ఎస్ వస్తుంది…

ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 100 సీట్లతో మళ్లీ అధికారంలోకి రాబోతున్నది అని కేటిఆర్ వివరించారు. జాతీయ ఛానెళ్లు అన్నీ ఎగ్జిట్ పోల్స్ అదే విషయాన్ని వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే ఎక్కువ సీట్లు రాబోతున్నాయని చెప్పారు. తమ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడితే ఆ విషయం తేలిందన్నారు.  2/3 వంతు మెజారిటీతో అధికారంలోకి రాబోతున్నాం అన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనడమే దీనికి నిదర్శనమన్నారు. ఒక శబ్ద విప్లవానికి నాంది పలకబోతున్నారు అని చెప్పారు. ప్రజా చైతన్యానికి ఓటింగ్ శాతమే నిదర్శనమన్నారు. ఏకపక్షంగా ప్రజలు ఇవ్వబోయే తీర్పుకు ఇది సంకేతం కాబోతోందన్నది తమ విశ్వాసం అని కేటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. 

డిసెంబర్ 11న సంబరాలు చేసుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కేటిఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పాల్గొన్న ప్రజలకు టీఆర్ఎస్ తరపున ధన్యవాదాలు చెప్పారు. 90 రోజుల పాటు ఎన్నికల ప్రచారం అద్భుతంగా పని చేసిన తమ నాయకులు, కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు చెప్పారు కేటిఆర్. 

ఎప్పుడైతే చంద్రబాబు నాయుడును తెచ్చి నెత్తిన పెట్టుకున్నారో అప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ ఖతమైపోయిందని కేటిఆర్ మరోసారి చెప్పారు. చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ ఇద్దరు కలియదిరిగినా జనాలు మాత్రం టిఆర్ఎస్ వైపే నిలిచారని వివరించారు. పత్రికా యాడ్స్ కూడా టిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వారే ఎక్కువగా వెదలజల్లారని చెప్పారు.

తాము సమన్వయంతో ఉన్నప్పటికీ కోట్లాది రూపాయల డబ్బు పారించారని విమర్శించారు. ప్రచారం చివరి రోజుల్లో చంద్రబాబుతో తమకు నష్టం ఏంటో కాంగ్రెస్ గుర్తించి చివరకు చంద్రబాబు బొమ్మలు లేకుండానే పత్రికా యాడ్స్ విడుదల చేశారని వివరించారు. తెలంగాణ పాలిట ఆ కూటమి విషపు కూటమి అని జనాలు గుర్తు పట్టి ఓడించారని చెప్పారు. 

ఇవిఎం ల విషయంలో, ఇంకేదైనా విమర్శలు చేయడం అంటే ఓడిపోయేవారు చేసేవే అన్నారు. తమకు ఎలాంటి అనుమానాలు లేవని తేల్చి చెప్పారు కేటిఆర్. కేసిఆర్ 75 వేల పైచిలుకు మెజార్టీతో గెలుస్తాడని చెప్పారు కేటిఆర్. బట్టి విక్రమార్క, జానారెడ్డి, రేవంత్ రెడ్డి, డికె అరుణ లాంటి లీడర్లు కూడా ఓటమిపాలవుతారని చెప్పారు. జిహెచ్ఎంసి ఫలితాలే ఈ ఎన్నికల్లో పునరావృతమవుతాయని కేటిఆర్ జోస్యం చెప్పారు. 

ఈ ఎన్నికల్లో జిహెచ్ఎంసిలో టిఆర్ఎస్ 16 నుంచి 17 సీట్లలో గెలుస్తుందని చెప్పారు. కరీంనగర్ లో 12 సీట్లకు పైగా గెలుస్తామన్నారు. ఓటింగ్ శాతం పెరిగినా టిఆర్ఎస్ కే అనుకూలమని చెప్పారు. ఈ ఎన్నికల్లో మీడియా సంస్థల నైజం ఏంటో బయటపడిందన్నారు. ఇక బిజెపి 100 సీట్లలో డిపాజిట్లు కోల్పోతుందని జోస్యం చెప్పారు.