ఎంపీ రేవంత్ రెడ్డి ఒకవైపు కేసీఆర్ మీద ఫైట్ చేస్తూనే కాంగ్రెస్ పార్టీలో తన స్థానాన్ని పదిల పరుచుకోవడానికి కృషి చేస్తున్నారు. పార్టీలోకి వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నాటి నుండి ఆయన మీద సీనియర్ నాయకులకు కన్ను కుట్టింది. వీహెచ్, జానారెడ్డిలు, జగ్గారెడ్డిలు ప్రత్యక్షంగానే రేవంత్ చీఫ్ అయితే తాము పార్టీలో ఉండబోమని తెగేసి చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం చీఫ్ పదవికి పోటీపడుతూ రేవంత్ మీద కునుకు వహించారు. మొదట్లో రేవంత్ మీద సానుకూలంగానే ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆతర్వాత మెల్లగా సీనియర్ నాయకులకు వంత పాడటం స్టార్ట్ చేశారు. దీంతో రేవంత్ తన సొంత శైలిని ఆచరణలో పెట్టారు.
ఎవ్వరినీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోవడం ఆరంభించారు. అదే ఆయనకు ప్లస్ అయింది. కాంగ్రెస్ శ్రేణులు సైతం రేవంత్ రెడ్డి వైపే చూశాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రాజీవ్ రైతు భరోసా యాత్రకు ముగింపుగా రావిర్యాలలో రణభేరి సభ నిర్వహించారు. ఈ సభ వెనుక రేవంత్ ముఖ్య ఉద్దేశ్యాల్లో పార్టీలో తన వైపు ఎంత మద్దతు ఉందో చూపించడం కూడ ఒకటి. రేవంత్ పాదయాత్ర మీద మొదటి నుండి వ్యతిరేకంగానే ఉన్న సీనియర్లు అనుకున్నట్టే రణభేరి సభకు దూరంగా ఉన్నారు. రేవంత్ సభకు రావాలని ఆహ్వానం పంపినా ఉత్తమ్ కుమార్, భట్టి, జీవన్ రెడ్డి, జానారెడ్డి అందరికీ ఆహ్వానం పంపారు. అయినా వారెవరూ రాలేదు. అయితే వాళ్ళ గైర్హాజరు సభ మీద ఎలాంటి ప్రభావమూ చూపలేదు.
శ్రేణులు అంతా రేవంత్ రెడ్డి వైపే చూసారు తప్ప ఉత్తమ్ రాలేదు, భట్టి రాలేదు, జనారెడ్డి దూరం పెట్టారు లాంటి మాటలే పెద్దగా వినబడట్లేదు. అంతా రేవంత్ మాట్లాడిన మాటల గురించే చర్చించుకుంటున్నారు. 16 జిల్లాల డీసీసీ అధ్యక్షులతోపాటు కార్యనిర్వాహక అధ్యక్షులు కుసుమ్‌కుమార్, పొన్నం ప్రభాకర్ సభలో పాల్గొన్నారు. మాజీ మంత్రులు చిన్నారెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్యే సీతక్క, సంభాని చంద్రశేఖర్, షబ్బీర్ అలీ, బలరాం నాయక్, దాసోజు శ్రవణ్, ఇందిరా శోభన్, మానవతారాయ్ హాజరవడం, కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాకపోయినా తన మద్దతు తెలపడంతో పార్టీలో రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువే ఉన్నారని, ఇన్నాళ్లు సీనియర్ నాయకుల వెనకున్న వారు కూడ రేవంత్ దారిలోకి వచ్చేశారని స్పష్టమైంది. ఈ పరిణామం చూస్తే రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే సీనియర్లు ఒంటరిగా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.