తెలంగాణ హాట్ న్యూస్: టిఆర్‌ఎస్‌లో కేటిఆర్ కొత్త వర్గం ఇదేనా?

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు పెద్దలు. అదే మాటను ఫాలో అవుతున్నారు కొందరు టిఆర్ ఎస్ నేతలు. టిఆర్ ఎస్ లో కీలక పదవుల్లో ఉన్నవారు, క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నేతలంతా తమ పిల్లలను రాజకీయ రంగంలోకి దించేందుకు చకచక పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా తమ ప్రయత్నాలు ముమ్మురం చేశారు. వీరికి సీఎం తనయుడు, మంత్రి కేటిఆర్ అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల బరిలోకి దాదాపు 30 మంది టిఆర్ ఎస్ నేతలు తమ వారసులను దించేందుకు సిద్దమయ్యారు. ఇక్కడ కొందరు నేతలు తాము క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతూ తమ వారసులను బరిలోకి దింపుతుండగా మరికొందరు మాత్రం తాము ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాల్లోనే తనయులను రంగంలోకి దింపి తాము పక్క నియోజకవర్గాలకు ఎగబాకేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. వారసుల రంగం ప్రవేశం గురించి ఒకసారి పరిశీలిస్తే..

విప్లవ్ కుమార్                      విజయలక్ష్మీ

 

రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు తన కూతురు విజయలక్ష్మీ, కుమారుడు విప్లవ్ కుమార్ లను జూబ్లిహిల్స్ , ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటికి దింపేందుకు సిద్దమవుతున్నారు. వారిలో ఇద్దరికి కాకున్నా ఏ ఒక్కరికైనా టిక్కెట్ దక్కించుకునేందుకు ఆయన ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి టిక్కెట్ ను ఆశిస్తున్నాడు. ప్రస్తుతం కార్పొరేటర్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ముషిరాబాద్ లో బలమైన నాయకుడిగా శ్రీనివాస్ రెడ్డి ఉండటం, నాయిని నర్సింహ్మరెడ్డి మద్దతు కూడా ఉండటంతో ఆయనకే దాదాపు టిక్కెట్ ఖరారయినట్టుగా కార్యకర్తలు చెబుతున్నారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ సికింద్రాబాద్ లోక్ సభ నుంచి పోటిచేయాలని ఆశిస్తున్నారట. దీనిపై ఇప్పటికే తలసాని  శ్రీనివాస్ యాదవ్ పార్టీ ముఖ్యులతో చర్చించారని అంటున్నారు. అందుకే సాయికిరణ్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో విస్తృత ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. సికింద్రాబాద్ పరిధిలో ఎక్కడ చూసినా సాయి కిరణ్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయని పార్టీ నేతలు అంటున్నారు.

మంత్రి మహేందర్ రెడ్డి భార్య సునీతా మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ గా, తమ్ముడు నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి సోదరుని కుమారుడు  అవినాష్ రెడ్డి అసెంబ్లీకి పోటి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి కొడంగల్ లేదా షాద్ నగర్ అసెంబ్లీ  నియోజకవర్గాల్లో ఏదో ఒకదానిలో పోటిచేయాలని భావిస్తున్నరట.  అందుకే ఆ రెండు నియోజక వర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

జూపల్లి అరుణ్ రావు

 

మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు అరుణ్ రావు ఇప్పటికే నియోజక వర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లికి పోటి చేసే విధంగా ఆయన ప్రయత్నిస్తున్నారు.

దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొడుకు గౌతమ్ రెడ్డి కూడా రాజకీయాల్లో వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారట. ఎప్పుడెప్పుడు పొలిటీషియన్ అయిపోవాలా అన్న ఉత్సుకతతో గౌతమ్ ఉన్నట్లు నిర్మల్ లో చర్చ సాగుతున్నది. గతంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గౌతమ్ వెళ్లి శంకుస్థాపన చేశారు. దీంతో విపక్షాలు సీరియస్ కావడంతో గౌతమ్ సైలెంట్ అయ్యారు. కానీ ఎప్పటికైనా రాజకీయాల్లో ప్రవేశించేందుకు గౌతమ్ రెడీగా ఉన్నారు.

మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు కుమారుడు విజిత్ రావు కూడా రాజకీయాలపై కన్నేశారు. ఆయన పొలిటికల్ హడావిడి చేస్తున్నారు. తండ్రి బాటలో నడిచేందుకు కసరత్తు చేస్తున్నారు.

నల్లాల క్రాంతి

చెన్నూరులో చీఫ్ విప్ నల్లాల ఓదేలు కొడుకు నల్లాల క్రాంతి కూడా యాక్టీవ్ గా ఉన్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. కేడర్ లో మంచి పట్టు సాధిస్తున్నారు. ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్నారు క్రాంతి. అయితే ఆ వివాదం చిలికి చిలికి గాలి వాన అయింది. తర్వాత తమ చతురతతో నల్లాల ఓదేలు ఆ వివాదాన్ని క్లోజ్ చేశారు.

సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప కొడుకు కోనేరు వంశి కూడా యాక్టీవ్ గానే ఉన్నారు. ఆయన రాజకీయ రంగం ప్రవేశం 2019లోనే ఉంటుందా అన్న చర్చ ఉంది.

రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని సంచలన ప్రకటన చేసి తర్వాత పైనుంచి ఆదేశాలు అందడంతో విరమించుకున్న ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కుమారుడు అరుణ్ కూడా ఎన్నికల్లో పోటికి సై అంటున్నారు. సోమారపు చేసిన రాజకీయ సన్యాసం ప్రకటన టిఆర్ఎస్ వర్గాల్లో కలవరం రేపింది.

పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ముగ్గురు కొడుకుల్లో ఈసారి ఒకరిని బరిలోకి దించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే బాన్స్ వాడ నుంచి పోచారం తన చిన్న కొడుకు భాస్కర్ రెడ్డిని బరిలోకి దించి పార్టీ అనుమతిస్తే తాను జహీరాబాద్ ఎంపి సీటుకు పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ జహీరాబాద్ ఎంపి టికెట్ రాకపోతే బాన్స్ వాడలో పోచారం పోటీలో ఉంటూనే భాస్కర్ రెడ్డిని యాక్టివ్ పొలిటీషియన్ గా తయారు చేయవచ్చని అంటున్నారు.

సిరికొండ ప్రశాంత్, సుస్మితా పటేల్

ఎప్పుడూ హాట్ గా ఉండే వరంగల్ రాజకీయం వారసులు రాకతో రసవత్తరంగా మారనుంది. స్పీకర్  సిరికొండ మధుసూధనచారి తనయుడు ప్రశాంత్ భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటి చేయాలని భావిస్తున్నారు.ఇదే నియోజకవర్గం నుంచి కొండా దంపతులు తమ కుమార్తె కొండా సుస్మితా పటేల్ ను  బరిలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే పలు సమావేశాలలో ఈ విషయాన్ని కొండా దంపతులు బహిరంగంగానే చెప్పారు.

దీంతో స్పీకర్, కొండా వర్గీయుల మధ్య వైరం నడుస్తుంది. భూపాలపల్లి నియోజకవర్గంలో శాయంపేట, రేగొండ మండలాల్లో కొండా దంపతులకు మంచి పట్టున్నది.

కడియం కావ్య

అందుకే వారు ఈ నియోజకవర్గంలో తమ కుమార్తెను బరిలోకి దింపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కొండా సురేఖ వరంగల్ తూర్పు లోనే పోటీ చేయనున్నట్లు చెబుతున్నారు.ఈలాగే డిప్యూటి సీఎం కడియం  శ్రీహరి కుమార్తె కడియం కావ్య స్టేషన్ ఘన్ పూర్ నుంచి పోటి చేయాలనే ఆలోచనలో ఉందని తెలుస్తోంది.   డాక్టర్ యిన కావ్య చాలా చురుకైన మహిళ కావడంతో వారుసురాలిగా ఆమె విజయమవుతుందని కడియం శ్రీహరి భావిస్తున్నారు. ఆమె రాక కోసం రంగం తయారుచేస్తున్నారు.

ఈటల రాజేందర్ భార్య జమున కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ తనయుడు ప్రహ్లాద్ కూడా రాజకీయాల్లోకి రానున్నారు. ఈసారి ములుగులో పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఖమ్మంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తనయుడు యుగంధర్ రావు కోదాడ నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్దమయ్యాడని వార్తలొస్తున్నాయి.

ఈటెల రాజేందర్, భార్య జమున

వీరే కాకుండా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి కూడా తన ఇద్దరు కొడుకుల్లో ఒకరిని బరిలోకి దింపుతారన్న చర్చ ఉంది. ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తన కుమారుడిని బరిలోకి దింపొచ్చన్న చర్చ ఉంది. అలాగే తీగల కృష్ణారెడ్డి సైతం వారసులను రాజకీయ రంగంలోకి తీసుకొచ్చే పనిలో ఉన్నారు.

ఈ వారసుల రాకకు మంత్రి కేటిఆర్ అండదండలు ఉండటంతో వారంతా తమ కార్యాచరణ షురూ చేసేశారు. నగరాలను వదిలేసి పల్లెబాట పట్టారు. నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకుని ప్రజలతో కలిసిపోయేందుకు నానా తంటాలు పడుతున్నారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల మధ్య హడావిడి చేస్తున్నారు.