తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు అందించగా, ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ భేటీలో కడియం శ్రీహరి, అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావుతో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఫిరాయింపులపై ఇప్పుడు తీసుకోవాల్సిన మార్గం ఏమిటనే అంశంపై వీరు ప్రధానంగా చర్చించుకున్నారని సమాచారం. ఈ నోటీసులపై మరింత స్పష్టత పొందేందుకు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని చవిచూసిన నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను ఆశ్రయించారు. అయితే, ఈ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ తొలుత హైకోర్టును ఆశ్రయించింది. అయితే, అనుకూలంగా తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లగా, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు తమ తదుపరి కార్యాచరణను ప్రణాళికాబద్ధంగా రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని రగిలించడంతో, అసెంబ్లీలో ఫిరాయింపులపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ నోటీసులు ఎమ్మెల్యేల భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.