ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రతిపక్షాల గూబ గుయ్యిమనే తీర్పు వస్తుందని, ఎన్నికల విషయాన్ని పెద్దాయన చూసుకుంటారని మంత్రి కేటిఆర్ అన్నారు. ఎన్నికలు 3 నెలల్లో వచ్చినా 6 నెలల్లో వచ్చినా గెలిచి తీరుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎన్నోసార్లు అవకాశమిచ్చారని కానీ టిఆర్ ఎస్ ను ఒక్క సారికే దించేయాలని వాళ్లు అంటున్నారని దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజక వర్గ నేతలు కేటిఆర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
తెలంగాణకు కాంగ్రెస్సోళ్లు పట్టించిన 60 ఏళ్ల గబ్బుని దరిద్రాన్ని నాలుగేళ్లలో పోగోట్టాలనడం విడ్డూరంగా ఉందన్నారు. తనను బచ్చాగాడు అంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాందీకి 45 ఏళ్లు. ఆయన రెండు సార్లు ఎంపీ అయ్యారు. నేను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఎవరు బచ్చా అని కేటిఆర్ ప్రశ్నించారు. తాను 2006 నుంచి ఉద్యమంలో ఉండి జైలుకెళ్లి లీడర్ అయ్యానని, రాహుల్ ఏ ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లి లీడర్ అయ్యారో చెప్పాలని నిలదీశారు.
బ్లాక్ మెయిల్ చేసుకొని బతికేవాళ్లు కూడా సీఎం కేసీఆర్ ను విమర్శిస్తున్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటిఆర్ వ్యాఖ్యానించారు. డబ్బాలు, సంచుల్లో నోట్ల కట్టలు పెట్టడం కాంగ్రెస్ నేతలకే బాగా తెలుసన్నారు. కాంగ్రెస్ దగుల్బాజి పార్టీ అని 2014 వరకు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుండా మోసం చేశారన్నారు. పేపర్లు, టివిలు చూస్తుంటే రేపే ఎన్నికలు అన్నంతా హడావుడి కనిపిస్తుందని, ఎన్నికలు అంటే ప్రతిపక్షాలకు భయమేందుకు అని కేటిఆర్ ప్రశ్నించారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు నల్లగొండలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండేవని ఇప్పుడు అభివృద్ది పథంలో దూసుకుపోతుందన్నారు.