మంత్రి వర్గంలో ఆ  ఇద్దరికి చోటు లేనట్టే

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరగనుంది. ఇప్పటికే పలువురు ఆశావాహులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు. అసలు మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందో లేదోనన్న టెన్షన్ లో కొందరు మాజీ మంత్రులు ఉన్నారు. అయితే పార్టీలో కీలకమైన ఇద్దరు నేతలకు మంత్రివర్గంలో  ఈ దఫా వారికి అవకాశం లేదని తెలుస్తోంది. రెండో విడతలోనే వారికి అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం.

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మరియు ట్రబుల్ షూటర్ గా పేరున్న హారీష్ రావులకు ఈ సారి కేబినేట్ విస్తరణలో అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది. వీరిద్దరికి కూడా లోక్ సభ ఎన్నికల తర్వాతే కేబినేట్ లో అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారని టిఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తెలంగాణలో అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకొని టిఆర్ఎస్ రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల పైనే దృష్టి పెట్టాడు. తాను సీఎంగా, హోం మంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. కానీ పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు.

కేటిఆర్ ను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన తర్వాత తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా టిఆర్ఎస్ పార్టీనే విజయం సాధించింది. జీహెచ్ ఎంపీ ఎన్నికల్లో గెలుపులో కూడా కేటిఆర్ కీలక పాత్ర పోషించారు. అసెంబ్లీ గెలుపులో కూడా కేటిఆర్ కు అప్పగించిన నియోజకవర్గాల్లో టిఆర్ ఎస్ సభ్యులే గెలుపొందారు. దాంతో కేటిఆర్ కు నిన్న మొన్ననే పార్టీ పగ్గాలు అప్పగించడంతో మరి కొంత కాలం పూర్తిగా పార్టీకే పరిమితం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.   

హారీష్ రావు పార్టీ ప్రారంభం నుంచి ఉన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కు హారీష్ రావు వెన్నంటి ఉన్నారు. ఉద్యమంలో హారీష్ రావు కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రిగా పని చేశారు. ఎక్కడ హారీష్ కు బాధ్యతలు అప్పగించినా విజయం సాధ్యమని కేసీఆర్ నమ్ముతారు. అదే విధంగా ఎక్కడ హారీష్ రావు బాధ్యతలు చేపట్టినా విజయం ఖాయమే.

త్వరలోనే లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 16 సీట్లు గెలవాలని కేసీఆర్ టార్గెట్ పెట్టుకున్నారు. దీంతో  ఈ ఎన్నికల్లో కూడా ఈ ఇద్దరి నేతల అవసరం కీలకమని అందుకే వీరికి మంత్రి పదవులు ఇప్పుడే వద్దని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. వీరికి మంత్రి పదవి బాధ్యతలు ఇప్పుడే అప్పగిస్తే అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి పూర్తి సమయం కేటాయించలేరని కేసీఆర్ ఆలోచిస్తున్నారని నేతలు అంటున్నారు. అందుకే వీరికి తర్వాతి దశలో కేబినేట్ బెర్తు ఖాయం కానుంది.