Konda Vishweshwar Reddy: కేసీఆర్, కేటీఆర్‌పై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు

Konda Vishweshwar Reddy

Konda Vishweshwar Reddy: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సిట్ విచారణకు హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 2018 ఎన్నికల్లో ఓడిపోతామని ముందే గ్రహించిన కేసీఆర్ అండ్ కో ఫోన్ ట్యాపింగ్ ద్వారా బెదిరింపులకు పాల్పడి గెలిచారని ఆరోపించారు. ఇక భవిష్యత్తులో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రారని జోస్యం చెప్పారు.

కేవలం తమ పదవులను కాపాడుకోవడం కోసమే కేసీఆర్, కేటీఆర్ ఇంత నీచమైన చర్యకు దిగారని మండిపడ్డారు. వారికి చట్టంపై, వ్యక్తుల గోప్యతపై ఏమాత్రం గౌరవం లేదని ఆయన ధ్వజమెత్తారు. గతంలో తాను జితేందర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణను ప్రణీత్ రావు రికార్డ్ చేసిన ఆడియో క్లిప్‌ను సిట్ అధికారులు తనకు వినిపించారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు తన ఇంట్లోకి చొరబడి కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తనిఖీ చేశారని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రశ్నించినందుకు తిరిగి తానే పోలీసులపై దాడి చేసినట్లు కేసు పెట్టారన్నారు.

ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడానికి నిరాకరించారన్నారు తనపై నాన్-బెయిలబుల్ కేసులు పెట్టి ఎన్నికల తర్వాత అరెస్టు చేయాలని కుట్ర పన్నారని వెల్లడించారు. స్వయంగా అప్పటి డీజీపీనే తనను అరెస్టు చేస్తారని చెప్పడంతో భయంతో రెండు వారాల పాటు బెంగళూరులో తలదాచుకోవాల్సి వచ్చిందని కొండా వాపోయారు. తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్న తనకే ఈ పరిస్థితి ఎదురైందన్నారు. తన భార్య ఫోన్ కూ ట్యాప్ చేసి ఆమెను ఫాలో అయ్యారని విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.