తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం సెప్టెంబర్ ను టర్గెట్ గా చేసుకుని కేసీఆర్ సర్కార్ కు హెచ్చరికలు చేశారు. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే మరోవైపు మహా కూటమి ఏర్పాటు దిశగా ఆయన అడుగులు వేస్తున్నాడు. కేసీఆర్ సర్కార్ కు సెప్టెంబర్ లో చమటలు పట్టించేందుకు ఆయన స్కెచ్ వేస్తున్నారు.
భూ రికార్డుల ప్రక్షాళనలో అనేక తప్పిదాలు జరిగాయని సీఎం కేసీఆర్ ఒప్పుకున్నారని కోదండరాం చెప్పారు. ఆ తప్పిదాలను జూన్ 20లోగా పరిష్కరించాలని సీఎం ఆదేశాలిచ్చినా అది ఇప్పటికి అతిగతి లేదన్నారు. ఇప్పుడు జూలై 20 వస్తుందని అయినా సరే ఆగష్టు నెలాఖరు వరకు ఆగుతాం. సమస్యలు కొలిక్కిరాకపోతే సర్కార్ పై సమరమే అన్నారు. అప్పటికి కూడా సమస్య పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ లో తుఫాను వస్తుందని, ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జన సమితి అధినేత కోదండరాం హెచ్చరించారు. రైతులకు ఓపిక నశించిందని, తమకు కూడా ఓపిక నశించిదని ఇక ఆగేది లేదన్నారు.
తెలంగాణ జన సమితి స్థాపించినప్పటి నుంచి కోదండరాం ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్నాడు. దీంతో ఆయనను మెసలనీయకుండా ప్రభుత్వం ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుంది. విభజన సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్, సిపిఐ, టిడిపిలతో కలిసి ఆయన గవర్నర్ ను కలిశారు. దీంతో రాజ్ భవన్ వేదికగా మహాకూటమి ఏర్పడబోతుందని వార్తలు వచ్చాయి. అదే విధంగా కోదండరాం కూడా ఇతర పార్టీల నాయకులతో స్నేహపూర్వకంగానే ఉంటున్నారు. ఇప్పటికే సిపిఐతో కలిసి పోటి చేస్తామన్న సంకేతాలు కోదండరాం ఇచ్చారు. ఆయన కూడా పలుసార్లు నేతలతో చర్చలు జరిపారు. అలాగే కాంగ్రెస్ నేతలతో కూడా కోదండరాం సమావేశాలు అవుతున్నారు. దాంతో పాటుగా కాంగ్రెస్ నిర్వహించే సమావేశాలకు కోదండరాంని ఆహ్వానిస్తే ఆయన కూడా గౌరవప్రదంగా హాజరవుతున్నారు. కాంగ్రెస్ సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు ఇది అన్యాయమంటూ ఆయన తన స్వరాన్ని గట్టిగానే వినిపించారు.
ఎందుకంటే ఈ మధ్య కాంగ్రెస్ కూడా తన దూకుడు పెంచి ప్రభుత్వంపై పోరాడుతుంది. అదే సమయంలో సిపిఐ, టిడిపి కూడా ఏదో ఒక నిరసనతో ఉద్యమిస్తున్నాయి. వీరిద్దరిని కలుపుకొని కోదండరాం ఉద్యమించబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఏ పార్టీ కూడా ఒంటరిగా వెళ్లి టిఆర్ ఎస్ ను ఓడించే పరిస్థితి లేదు. అందుకే అన్ని పార్టీలు కూడా ఇతర పార్టీలతో కలవాలనే ప్రణాళికలో ఉన్నాయి. టిఆర్ ఎస్ తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా ఒకే భావనతో ఉన్నాయి. అటువంటప్పుడు కలిసి పోతే ఇంకా పెద్ద ఎత్తున్న ఉద్యమించవచ్చనది ఆలోచనగా తెలుస్తుంది.
సెప్టెంబర్ లో జనసమితి అన్ని పార్టీలని కలుపుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమించబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కోదండరాం ఉద్యమ నేతగా అన్ని పార్టీలకు సుపరిచితుడు కావడం కలిసొచ్చే అంశం. అదే విధంగా అన్ని పార్టీలతో కలగలిసి పోయే నాయకుడు కూడా కావడం ప్లస్ పాయింట్ . అదే విధంగా గత కొంత కాలంగా మరికొన్ని వార్తలు కూడ వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం కొట్టుకునే బదులు కేసిఆర్ ను గద్దె దింపడమే లక్ష్యమైతే కోదండరాంని సీఎం అభ్యర్ధిగా ప్రకటించి కలిసి రంగంలోకి దిగితే కాంగ్రెస్ కు కలిసొచ్చే అవకాశం గా ఉంటుందని కొందరు నేతలు అభిప్రాయ పడుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి సెప్టెంబర్ లో తెలంగాణ జనసమితి పార్టీ.. కేసీఆర్ కు చుక్కలు చూపించబోతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో జరుగుతుంది.