కేసిఆర్ తీస్ మార్ ఖాన్ కాదు, అట్లయితే మేం రెడీ : కోదండరాం

తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సోమవారం పార్టీ ఆఫీసులో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. తాజా రాజకీయ పరిణామాలు, ముందస్థు ఎన్నికల హడావిడిపై కోదండరాం స్పందించారు. ఆయన ఏమన్నారో చదవండి.

ముందస్తు ఎన్నికలు డిసెంబర్ లో అయితే జరగొచ్చు. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు పోతామని కేసీఆర్  అనొచ్చు కానీ కేంద్రం ఎన్నికలు నిర్వహిస్తుందా లేదా రాష్ట్ర పతి పాలన కొనసాగిస్తుందా? అన్నది తెలియదు. డిసెంబర్ 2తరువాత అయితేనే ఎన్నికల వ్యవహారం ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్తుంది. అంతకముందు కేసిఆర్ ఏం చేసినా వ్యవహారమంతా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. ముందస్తు కు వెళ్లేందుకు కేంద్రం తనకుసహకరిస్తుంది అని కేసీఆర్ ఆలోచిస్తున్నాడు. నాకున్న సమాచారం ప్రకారం ముందస్తు ఎన్నికలకు బీజేపీ కేసీఆర్ కు సహకరించదు. కేసీఆర్, బీజేపీ ఇద్దరు రాజకీయ లబ్ది పొందలనుకుంటున్నారు. నవంబర్, అక్టోబర్ లో ముందస్తు ఎన్నికలు అని అనుకోవడానికి గ్యారెంటీ లేదు. కేసీఆర్ ముందస్తుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నాడో స్పష్టత లేదు. బయటకి బలమైన కారణం చెప్పలేక పోతున్నాడు.

అప్పుడు చంద్రబాబు ముందస్తుకు వెళ్లి నష్టపోయారు. ముందస్తుకు వెళ్లి ఇతర పార్టీలను దెబ్బతీయలని కేసీఆర్ భావిస్తున్నాడు, కానీ కేసీఆర్ కు టీఆరెస్ పార్టీ లోని సమస్యలు పరిష్కరించడం అంత తేలిక కాదు. ముందస్తు వస్తే టీజేఎస్ పార్టీకి లాభం. సెప్టెంబర్ లోపే టీజేఎస్ పార్టీ  ప్రజలకు చేరవ అవుతుంది. కొత్తగా రాజకీయాల్లో కి వచ్చేవారు, గతం లో రాజకీయాల్లో వుండి టికెట్ రాని వారు మా పార్టీలోకి వస్తారు. పొత్తుల కంటే మేము సొంతంగా బలపడడానికి దృష్టి పెడుతున్నాం. పొత్తుల కోసం ఇప్పుడే ఆలోచిస్తే పురిట్లో బిడ్డను చంపుకున్నట్టే. ఎన్నికలకు తెలంగాణ అంశమే మేజర్ ఫ్యాక్టర్. ప్రజలకు అర్థం అయ్యింది కేసీఆర్ తమను మోసం చేసాడు అని. ప్రజల ఆకాంక్షను తీర్చే పార్టీ కేవలం టీజేఎస్ మాత్రమే.

రాజకీయాలలో కొత్త పార్టీ లకు అవకాశం ఉంది. గతంలో పిఆర్పీ, లోక్స్ సత్తా, దేవేందర్ గౌడ్ స్థాపించిన ఎన్టిపిపి పార్టీలను ప్రజలు ఆదరించారు.కానీ వారు నిలబడలేదు. సర్వేలు పేరుతో అన్ని పార్టీలు మాయ చేస్తున్నాయి. ఏ పార్టీ కూడా సర్వే చేయలేదు. సర్వేల పేరుతో కేసీఆర్ ఇతరులను, సొంత పార్టీలోని వారిని బయపెడుతున్నాడు. కనీసం ఒక్క సర్వే నైనా కేసీఆర్ బయటపెట్టాలి. కేసీఆర్ తీస్ మార్ ఖాన్ కాదు. ముందస్తు, మధ్యంతర ఎన్నికలు కేసీఆర్ చేతిలో లేవు, కేంద్రం చేతిలోనే ఉన్నాయి. ముందస్తు పేరుతో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా కేసీఆర్ ముందస్తు ఎన్నికలు అని చర్చకు తెర దీశాడు.