తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రజా కూటమి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్నది. ఈ ఓటమి బాధ నుంచి కూటమి పార్టీలైన కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, జన సమితి ఇంకా తేరుకన్నట్లు కనిపించడం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం కొద్దిగా తేరుకుని సమీక్షలకు దిగింది. కాంగ్రెస్ సమీక్షల్లో అసలు అంశాలను కాకుండా ఇతర అంశాలపై చర్చలు చేస్తున్నట్లు తెలంగాణ జన సమితి భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా కోదండరాం సంచలన కామెంట్స్ చేశారు.
ప్రజా కూటమిలోని కొంతమంది నేతల (కాంగ్రెస్, టిడిపి) ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఓటమికి ఈవిఎం లను బూచిగా చూపడం సరికాదన్నారు కోదండరాం. ఫలితాలు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈవిఎం లను మీద తప్పు నెట్టడంలో అర్థం లేదన్నారు. అసలు కారణాలను సమీక్షించకుండా ఉత్తుత్తి కారణాలను విశ్లేషణ చేయడం వల్ల లాభం లేదన్నారు.
తాను కేసిఆర్ తో పదేళ్లపాటు కలిసి పనిచేశానని, కేసిఆర్ ప్రచార శైలి గురించి ఎన్నిసార్లు కూటమి పార్టీ నేతలకు హెచ్చరించినా ఉత్తమ్, ఎల్.రమణ వినిపించుకోలేదన్నారు కోెదండరాం. కూటమి భాగస్వామ పక్షాలు ఓటమికి గల కారణాలను జన సమితి విశ్లేషణ చేస్తుందన్నారు. రాజకీయపరమైన వైఫల్యాలను చర్చించకుండా సమీక్షలు జరపడం సరికాదన్నారు. కేసిఆర్ ఎన్నికల ప్రచార సరళి ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పినా వినిపించుకోలేదని పైగా రకరకాల కామెంట్స్ చేశారని పేర్కొన్నారు.
సీట్ల సర్దుబాటు త్వరగా తేల్చండి అని తాను ఎంత చెప్పినా వినలేదన్నారు. నెలకు పైగా సమయం ఉంటే తప్ప కేసిఆర్ ను ఎదుర్కోలేమని చెప్పానని, అయినా ఆలస్యం చేశారన్నారు. పైగా ప్రచారానికి మూడు వారాలు చాలు అని కాంగ్రెస్ ఉత్తమ్ మాట్లాడారని, అంతెందుకు రెండు వారాలు చాలు అని టిడిపి నేతలు అన్నారని వివరించారు. ఇంటింటి ప్రచారం అనేది జరగలేదని చెప్పారు. కేవలం సభలు, సమావేశాలతోనే ప్రచారం ముగించడంతో జనాల్లోకి ప్రచారం పోలేదన్నారు.
కూటమి ఎజెండా, మేనిఫెస్టో బాగానే ఉన్నా.. జనాల్లోకి తీసుకెళ్లలేకపోయామన్నారు. ప్రచారంలో ఎవరు ఎక్కడ పాల్గొనాలి అనేదాన్ని అంచనా వేయలేకపోయామన్నారు. ముఖ్యమైన నేతలును కూడా రాహుల్ సభల్లో ప్రసంగాలు చేయించడం వరకే పరిమితం చేశారని అన్నారు. అలా కాకుండా ఇతర ప్రదేశాల్లో కూడా ప్రచారం చేయించాల్సి ఉండిందన్నారు.
కేసిఆర్ తెర మీదకు తెచ్చి హడావిడి చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ అనేది సాధ్యం అయ్యే ప్రసక్తే లేదన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసిఆర్ చేస్తున్న రాజకీయాల వెనుక ఎవరున్నారో ఇంకా తమకు తెలియదన్నారు.
సీట్ల సర్దుబాటులో ఆలస్యం కావడం నష్టం చేకూర్చిందన్నారు. టిఆర్ఎస్ కుటుంబ పాలనను, కేసిఆర్ వైఫల్యాలను ఫోకస్ చేయలేకపోయామన్నారు. కేసిఆర్ రాజకీయ చతురతను అంచనా వేసి ఎదుర్కోవడంలో విఫలమయ్యామన్నారు. ప్రచార గడువు తక్కువ ఉండడం నష్టానికి కారణంగా చెప్పారు..
కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సీటు ఆఫర్ ఇచ్చినట్లు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు ఆ దిశగా తమ మధ్య చర్చలు కూడా జరగలేదన్నారు. తనకు ఎలాంటి రాజ్యసభ ఆఫర్ రాలేదన్నారు.
తెలంగాణలో ప్రజా కూటమి కొనసాగుతుందని వెల్లడించారు. రానున్న పార్లమెంటు ఎన్నికలపై త్వరలోనే సమావేశమై చర్చిస్తామని వివరించారు. కూటమి అనేది పార్లమెంటు ఎన్నికల్లో కూడా కంటిన్యూ అవుతుంది అని నమ్ముతున్నామన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కూటమి దిశగా సాగుతున్నందున ఇక్కడ కూడా కూటమి ఉండే అవకాశమే ఉందన్నారు.