తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇద్దరూ పదవి కోసం ఢీకొట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి తనకు తానుగా ఢిల్లీ పెద్దల ముందు పదవి కోసం పట్టుబట్టకున్నా ఆయన పేరు మాత్రం బలంగా వినిపిస్తోంది. మరోవైపు వెంకట్ రెడ్డి అయితే నేరుగా ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీతోనే చర్చలు జరిపినట్టు వార్తలొచ్చాయి. మరోవైపు వీహెచ్, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబులు కూడ పదవి కోసం పైరవీలు స్టార్ట్ చేశారు. ఎవరికివారు పార్టీలో సీనియర్లమని చెప్పుకుంటూ, పదవి ఇవ్వకపోతే తిరుగుబాటు ఖాయమని హైకమాండ్ ను బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి వెళ్లిపోయారు. కాంగ్రెస్ కనీస స్థాయిలో అయినా బలంగా ఉండి ఉంటే అధిష్టానం ఎప్పుడో నిర్ణయం తీసేసుకునేది. కానీ అవసాన దశలో ఉండటంతో ఎవరిని కాదంటే ఎలాంటి చిక్కు తెచ్చిపెడతారో, పార్టీ మరింత దెబ్బతింటుందని వెనుకడుగు వేశారు.
అయినప్పటికీ చేసేది లేక అభిప్రాయం సేకరణ మొదలుపెట్టారు. ముఖ్య నాయకులు హైదరాబాద్ చేరుకొని ఎవరిని అధ్యక్ష పదవిలో కూర్చోబెడితే బావుంటుందనే విషయమై సలహాలు, సూచనలు, అభిప్రాయాలూ తీసుకున్నారట. ఈ రిపోర్ట్ మొత్తాన్ని అధిష్టానం వద్దకు పంపారట. నిజానికి కాంగ్రెస్ హైకమాండ్ గురి మొదటి నుండి రేవంత్ రెడ్డి మీదనే ఉంది. ఆయనైతే పార్టీని దూకుడుగా నడిపించగలరని నమ్ముతున్నారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి శాంతం, సమన్వయం అంటూ నత్తనడకన నడవడంతో ఆశించిన ఫలితాలు దక్కలేదని, బీజేపీ ముందుకు వెళ్లిపోయిందని, మిగతావారు కూడ ఆయన శైలిలోనే ఉంటారని హైకమాండ్ అభిప్రాయం. ఇక రేవంత్ పేరును ప్రకటించడమే తరువాయి అనగానే సీనియర్లు అడ్డం తిరిగారు.
మొదటి నుండి రేవంత్ మీద అసహనంతో ఉన్న వారంతా అధ్యక్ష పదవిలో ఆయన్ను కూర్చోబెడితే ఇక తాము పార్టీలో ఉండక్కర్లేదని నేరుగానే చెప్పేశారు. అందుకే ఈ గొడవంతా. కొన్ని వారల తరబడి ఈ అంశం మీద కసరత్తు చేసిన హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డినే పీసీసీ చీఫ్ గా ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అడ్డుపడుతున్న సీనియర్ నాయకుల సంగతేమిటి అంటే అందుకు కూడ ఒక ఉపాయం ఆలోచించారట. ముందుగా వారందరినీ బుజ్జగించాలని, అది కుదరని పక్షంలో ఏం చేసుకుంటారో వారి ఇష్టానికే వదిలేయాలని డిసైడ్ అయ్యారట. వెళ్లిపోతామని బెదిరిస్తున్న సీనియర్ల వలన కష్టకాలంలో పార్టీ బావుకున్నది ఏమీలేదని, ఈ విషయంలో మాత్రం ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా వ్యవహరించాలని కాంగ్రెస్ భావిస్తోందట. ఇది సీనియర్లకు పెద్ద షాక్ అనే అనాలి. ఇక కోమటిరెడ్డి విషయానికి వస్తే ఆయన్ను కీలకమైన వర్కింగ్ కమిటీలోకి తీసుకుని ఆయనకు సర్దిచెప్పాలనే యోచనలో ఉన్నారట పెద్దలు.