కోదండరాం టార్గెట్ 50, మళ్ళీ కేసీఆర్ మీద గరం గరం

ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్  ఎంతో పెద్ద అవివేకిలా  తనకు కనిపిస్తున్నారని, ఇంత చెత్త ఆలోచనను ఆయన ఎందుకు చేశారోనని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టిఆర్ ఎస్ పాలనలో ప్రజల గోడు వినేవారు కరువయ్యారన్నారు. ప్రత్యేక రాష్ట్రంతో బాగుపడింది కేవలం కేసీఆర్ కుటుంబమేనన్నారు. తమకు పైసలిచ్చేవాడు వద్దని పనిచేసేవాడు కావాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.

తెలంగాణ జన సమితి పార్టీ దెబ్బతినేలా పొత్తులు ఉండవని, ఉద్యమ ఆకాంక్షల సాధనే అజెండాగా పొత్తుల విషయంలో ముందడుగు వేస్తామని అన్నారు.

 

గతంలో టిఆర్ ఎస్ అంటే ప్రజల్లో  ఉన్న అభిప్రాయం ఇప్పుడు లేదన్నారు. కేసీఆర్ తన ఒక్కరికే సొంత రాష్ట్రం వచ్చిందని అనుకుంటున్నారు

 

గతంలో టిఆర్ ఎస్ అంటే ప్రజల్లో  ఉన్న అభిప్రాయం ఇప్పుడు లేదన్నారు. కేసీఆర్ తన ఒక్కరికే సొంత రాష్ట్రం వచ్చిందని అనుకుంటున్నారని ఆయన నిప్పులు చెరిగారు. ఏ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి విజయం సాధించామో, ఆ లక్ష్యం నెరవేరనందునే టిజెఎస్ పార్టీని ప్రారంభించాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 50 నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేసే పనిలో ఉన్నామని కోదండరామ్ అన్నారు.

ఐదేళ్లు పరిపాలించమని అధికారమిస్తే చేతగాక మధ్యలోనే వదిలేశారని విమర్శించారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడుతాయని ప్రజలు కలలు కన్నారని అవి కల్లలయ్యారని వ్యాఖ్యానించారు. కుటుంబ పాలన చేసి తెలంగాణను ఆగం చేశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం సంతోషంగా ఉంటే బంగారు తెలంగాణ తయ్యారయినట్టేనా అని ప్రశ్నించారు. విశ్వనగరం చేస్తామన్న హైదరాబాద్ అభివృద్ది మరుగున పడిపోయిందన్నారు. టిజెఎస్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు.

ఇంటింటికి నీళ్లు ఇవ్వక పోతే ఓట్లు అడగనన్న కేసీఆర్…  అన్ని ఇళ్లకు నీళ్లు వస్తున్నాయా చూపిస్తారా అని కేసీఆర్ కు కోదండరాం సవాల్ విసిరారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాని చెప్పి తానే గద్దెనెక్కిన మహానుభావుడని విరుచుకుపడ్డాడు. డబుల్ బెడ్ రూం ఇండ్లేవి, కేజీ టూ పీజీ ఏమాయే.. దళితులకు 3 ఎకరాలు ఎటు పాయేనని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని దానికి చరమగీతం పాడే రోజు వచ్చిందన్నారు. యావత్తు తెలంగాణ సమాజం ఆలోచన చేసి కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పాలన్నారు. అమరవీరుల స్మారక స్థూపం నిర్మాణాన్ని మరిచి పోయారన్నారు. అమరుల త్యాగాలు తుంగలో తొక్కి అనర్హులకు పట్టం కట్టి కేసీఆర్ రాజ్యమేలాడని విమర్శించారు. కోదండరాం కాస్త దూకుడు పెంచి తన స్వరం పెంచడంతో జన సమితి శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి.