దుబ్బాక ఉప ఎన్నికల ముందు వరకు కేసీఆర్ అంటే ఒక స్పెషల్ ఫీలింగ్ ఉండేది జనాల్లో. ఇతర రాజకీయ నాయకులకు, రాజకీయాలకు ఆయన భిన్నమనే వాతావరణం ఉండేది. ఆయన వెనుక తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉండటంతో ఆయన ముందు ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని, అవతిలివారు ఎవరైనా తోకముడవాల్సిందే అనుకునేవారు. కానీ తాజా పరిణామాలతో అవన్నీ తాత్కాలికమేనని తేలిపోయింది. ఆయనకు కూడ ఓటమి ఉంటుందని రూఢీ అయింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో కేసీఆర్ లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని చివరకు ఓడిపోవాల్సి వచ్చింది. ఇన్నాళ్లు ఆయన్ను తెలంగాణ సాధకుడిగా చూసిన ఓటర్లు ఇకపై ప్రత్యేకంగా చూడాల్సిన పనిలేదని చెప్పేశారు.
రాష్ట్రంలో ఉనికి కోసం నానా తంటాలు పడుతున్న బీజేపీ ఏకంగా ఎన్నికల్లో అది కూడ రెండేళ్ల పదవీ కాలం మాత్రమే మిగిలున్న ఉప ఎన్నికల్లో ఓడించింది అంటే గత పరిస్థితులు ఇప్పుడు లేవనే అనుకోవాలి. కేసీఆర్ స్వయంగా దుబ్బాకలో ప్రచారం చేయకపోయినా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం మీటింగ్లు పెట్టి దూరం నుంచే ఎఫెక్ట్ చూపే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఇక త్వరలో రానున్న గ్రేటర్ ఎన్నికల కోసం కూడ కేసీఆర్ అందరిలానే సిద్ధమవుతున్నారు. ఇంతకుముందులా గెలిపించండి లేకపోతే మీకే నష్టం. వెళ్లి హాయిగా ఇంట్లో కూర్చుంటాను అనలేరు. అంటే సరే కూర్చోండి అంటూ సమాధానం ఇచ్చేలా ఉన్నారు జనం. గ్రేటర్ ఎన్నికల కోసం ఆయన ప్రకటిస్తున్న తాయిలాలు చూస్తేనే కేసీఆర్ నార్మల్ స్థాయికి వచ్చేశారని అర్థమవుతోంది.
ఆస్తి పన్ను చెల్లింపుల్లో 50 శాతం రాయితీ ఇస్తున్నారు. పన్ను 15 వేల లోపు ఉండే ఇంటి యజమానులు సగం కడితే చాలన్నమాట. అలాగే ఇప్పటికే పన్ను చెల్లించిన వారికి ఈ రాయితీని వచ్చే ఏడాది చెల్లింపుల్లో వర్తించేలా చేస్తామని పెద్ద హామీ ఇచ్చారు. అలాగే గ్రేటర్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను మూడు వేలు పెంచారు. ఇక వరదల వ్యతిరేకతను పూడ్చుకునేందుకు నష్టపోయినవారు సులువుగా సహాయం పొందే ఏర్పాటు చేశారు. అవసరం అనిపిస్తే ఇంకో 100 కోట్లు విడుదలచేస్తామని మాటిచ్చారు. ఇప్పటికే గ్రేటర్లో అనేక చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా కొన్నింటికి శంఖుస్థాపనలు చేయనున్నారు. ఇలా హామీల మీద హామీలు గుప్పిస్తున్న కేసీఆర్ ఇంతకుముందులా కాకుండా ఒక నార్మల్ పొలిటీషియన్ మాదిరిగానే కనబడుతున్నారు.