తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక మాట చెప్పారు అంటే అది జరిగి తీరాల్సిందే. ఏదైనా విషయంలో ఒక అంచనా వేశారు అంటే అది తప్పక నిజమవ్వాల్సిందే. ఇన్నాళ్లు అదే జరుగుతూ వచ్చింది. గత ఎన్నికల్లో పార్లమెంట్ ఫలితాలు మినహా అన్ని సందర్భాల్లోనూ ఆయన అంచనాలే నిజమవుతూ వచ్చాయి. ఆ ధీమాతోనే ఈసారి ఎన్నికల గురించి కూడ ఒక అంచనా వేశారు. అవే దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు. దుబ్బాక బైఎలక్షన్లలో తమకు లక్ష మెజారిటీ ఖాయమని కేసీఆర్ భావించారు. మొదట్లో పరిస్థితులన్నీ అలాగే ఉన్నా ఇప్పుడు తారుమారయ్యాయి. కాంగ్రెస్ బలంగా ఉంది. బీజేపీ కూడ ఎంతో కొంత ప్రభావం చూపడం ఖాయం.
ఇలాంటి పరిస్థితుల్లో లక్ష మెజారిటీ దేవుడెరుగు ముందు గెలిస్తే చాలని అనుకుంటున్నారు. అలాగని జస్ట్ విక్టరీతోనే సరిపెట్టుకుంటే సరిపోదు. లక్ష మెజారిటీ రాకుంటే కేసీఆర్ మాట చెల్లని నాణెం అయిపోతుంది. అసలే చెల్లని నాణాలంటే కేసీఆర్కు మహా చెడ్డ చిరాకు. అందుకే లక్ష అనేది ఆయనకు పరువు సమస్య అయింది. ఇప్పటికే మేనల్లుడు హరీష్ రావును రంగంలోకి దింపి కథ నడుపుతున్న కేసీఆర్ ఇకపై తానే స్వయంగా బరిలోకి దిగాలని భావిస్తున్నారట. ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని పూనుకుంటున్నారట. ఇదిలా ఉంటే దీనికి మించిన టెంక్షన్ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు.
ఈ ఎన్నికల్లో 100 సీట్లతో సెంచరీ కొడతామని కేసీఆర్ బహిరంగంగా అన్నారు. కానీ వరదలు ఆయన ఆశల మీద నీళ్లుచల్లాయి. వరదల భీభత్సానికి కేసీఆర్ పాలన, నిర్వహణాల మీద కోపంగా ఉన్నారు జనం. విశ్వనగరాన్ని చేస్తారనుకుంటే విశ్వానరకంగా ఉందని వాపోతున్నారు. పడవలు వేసుకుని పరామర్శలకు వెళ్లిన నేతల మీద తిరగడబడుతున్నారు. ఈ పరిణామాలు చూస్తే 100 కొట్టడం కష్టమనే భయం తెరాస శ్రేణుల్లో మొదలైంది. అదే జరిగితే ప్రత్యర్థులు కేసీఆర్ మీద ఎంతోకొంత పైచేయి సాధించినట్టే. ఇలా ఒకవైపున లక్ష, ఇంకోవైపున 100 నెంబర్లు కేసీఆర్కు గుబులు పుట్టిస్తున్నాయి. ఆ నెంబర్లు గనుక దక్కకపోతే పరువు పోవడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.