తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా గురువారం ఈటెల రాజేందర్ బాధ్యతలు స్వీకరించారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఇటీవల గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ల పై రోగుల బంధువులు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ ఘటనకు పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
మంత్రి బాధ్యతలు స్వీకరించిన కొద్ది సేపటికే ఆయనకు కొత్త చిక్కు ఏర్పడింది. గత కొద్ది రోజులుగా గాంధీ ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్లు ఆందోళన నిర్వహిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజులుగా వైద్య సేవలు బంద్ చేసి ఆందోళన చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి రాజేందర్ జూడాలను చర్చలకు ఆహ్వానించారు. జూడాలు మంత్రే తమ వద్దకు రావాలని, గాంధీ ఆస్పత్రికి వచ్చి చర్చించాలని పట్టుబట్టారు.
దీంతో ఈటెల రాజేందర్ ఏం చేయాలో పాలుపోక తలపట్టుకున్నట్టు తెలుస్తోంది. మంత్రి హోదాలో వారి వద్దకు వెళ్లి చర్చిస్తే తన పరిస్థితి ఏందని ఆయన డైలామాలో పడ్డట్టు నాయకుల ద్వారా తెలుస్తోంది. దీని పై ఎలా పరిష్కరించాలో మీరే చూడండంటూ అధికారులను ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే ఈటెలకు జూనియర్ డాక్టర్ల రూపంలో ఎదురు దెబ్బ తాకడంతో అంతటా చర్చనీయాంశమైంది.