తెలంగాణలో జనసేన పార్టీ వుందా.?

నిజానికి.. ఇదో మంచి సందర్భంగా జనసేన పార్టీకి.! తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామంటూ ఇప్పటికే జనసేన పార్టీ ప్రకటించింది. ఇంతలోనే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

సో, ఇదే మంచి తరుణం.! కొత్త మిత్రపక్షం టీడీపీతోనో, పాత మిత్రపక్షం బీజేపీతోనో.. లేకపోతే, రెండితోనో కలిసి జనసేన పార్టీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హంగామా షురూ చెయ్యాలి మరి.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా.? వారాహి విజయ యాత్రని ఆయన తెలంగాణలోనూ నిర్వహిస్తారా.? ఈ ప్రశ్నలిప్పుడు తెలంగాణ జనసైనికుల్లో కొంత అయోమయానికి కారణమవుతున్నాయి.

‘నువ్వు తెలంగాణలో పోటీ చెయ్ అన్నా.. నిన్ను గెలిపించుకుంటాం..’ అని పలు సందర్భాల్లో తెలంగాణ జనసైనికులు తనతో చెప్పారంటూ పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని చూశాం. ఏపీపై ఫోకస్ పెట్టారు గనుక, తెలంగాణలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా పోటీ చేయకపోవచ్చు. కానీ, తెలంగాణలో జనసేన నేతలైతే కొందరైనా బరిలో వుండేందకు అవకాశం లేకపోలేదు కదా.?

అలాంటప్పుడు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ హంగామా కనిపించాలి. శేరిలింగంపల్లి తదితర నియోజకవర్గాల్లో జనసైనికులు కొందరు కొంత హంగామా చేస్తున్న మాట వాస్తవం. కానీ, అది సరిపోదు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అలాగే మజ్లిస్ పార్టీలు.. చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తున్నాయి. ఈ సందట్లో జనసేన పార్టీని పట్టించుకునేదెవరు?