పొత్తులో జనసేనకు 12 సీట్లు… ఎక్కడెక్కడంటే…?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు వరుసగా మరుతుంటే… ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ఇదే సమయంలో వ్యూహాలూ ప్రతివ్యూహాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో… అధికార బీఆరెస్స్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తుండగా… బీజేపీ కాస్త వెనుకబడిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నోట జనసేన పొత్తు మాట తెరపైకి వచ్చింది.

రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా ఏపీలో టీడీపీతో పొత్తు ప్రకటించారు జనసేన అధింత చంద్రబాబు. ఇదే సమయంలో ఐదో విడత వారాహి యాత్ర సందర్భంగా ఎన్ డీఏ తో పొత్తు లేదని ప్రకటించారు పవన్. తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ… తూచ్ తాను ఎన్ డీఏ లోనే ఉన్నానని ప్రకటించారు. దీంతో… తెలంగాణలో జనసేనతో కలిసి పోటీచేద్దామని అంటున్నారంట బీజేపీ నేతలు!

ఇందులో భాగంగా బుధవారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ లు పవన్ తో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా… ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఇవ్వాలని పవన్ ను కోరారని తెలుస్తుంది. ఇదే సమయంలో కలిసి పోటీ చేయడం వల్ల ఎన్ డీఏ కి ప్లస్ అవుతుందని చెప్పారంట. అయితే ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన పవన్.. జనసేనకు 30 సీట్లు ఇవ్వాలని కోరినట్లు సమచారం!

ఈ క్రమంలో తాజాగా తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తాజాగా జనసేనతో పొత్తు విషయంపై స్పందించారు. ఇందులో భాగంగా… తెలంగాణలో జనసేనకు ఇచ్చే సీట్లపై కసరత్తు చేస్తున్నామని.. జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని, జనసేనకు బీజేపీతో కలిసి పోటీ చేయాలనే ఆలోచనా ఉందని తెలిపారు! దీంతో… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలుమెండుగా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

కాగా… తెలంగాణలో కూడా బీజేపీ పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కీలకమైన 32 నియోజకవర్గాలనైతే ప్రకటించారు కానీ.. వాటికి అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ… అత్యంత కీలకమైన, సెటిలర్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్న నియోజకవర్గాలను మాత్ర ఏరి ప్రకటించేశారు! దీనిపై రకరకాల కామెంట్లు వినిపించాయి!

ఈ సమయంలో బీజేపీ నేతలతో మాత్రం పొత్తులో అయితే కనీసం 119 స్థానాల్లోనూ జనసేనకు 30షానాలు ఇవ్వాలని కోరారంట. దీంతో… ఆలోచించిన బీజేపీ నేతలు 12 స్థానాలు ఇవ్వాలని ఫిక్సయ్యారని అంటున్నారు. వీటిలో ఖమ్మంలో 8, నల్లగొండలో 2, హైదరాబాద్, వరంగల్ లలో ఒక్కో సీటు జనసేనకు ఇవ్వాలని టీ.బీజేపీ భావిస్తుందని అంటున్నారు. ఇందుకు పవన్ ఒప్పుకుని తీరతారని కూడా పలువురు బలంగా చెబుతున్నారు.