టిఆర్ఎస్ నేత కారులో 6 కోట్లు, జనగామలో కలకలం

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అక్రమంగా తరలిస్తన్న డబ్బు పోలీసుల తనిఖీలలో దొరుకుతుంది. సోమవారం ఉదయం జనగాం జిల్లాలో భారీ ఎత్తున నగదు పట్టుబడింది. పెంబర్తి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద 6 కోట్ల రూపాయల నగదు దొరికింది. భారీ మొత్తంలో నగదు పట్టుబడడంతో జనగామలో కలకలం రేగింది.

జనగాం జిల్లా పెంబర్తిలో పోలీసులు చెక్ పాయింట్ ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో ఏపీ 37 సీకే 4985 అనే నంబర్ గల స్విఫ్ట్ కారు వచ్చింది. ఆ కారును ఆపి తనిఖీ చేయగా ఏకంగా 6 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి వరంగల్ కు ఈ కారు వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు.  ఆ కారులో ప్రయాణిస్తున్న వారు డబ్బులకు సరైన లెక్క చూపకపోవడంతో పోలీసులు నగదును స్వాధీన పరుచుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.

కారు జనగామ జిల్లా కేంద్రంలోని స్థానిక టిఆర్ఎస్ నాయకునిగా తెలుస్తోంది. భారీ మొత్తంలో డబ్బు పట్టుబడడంతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జనగామ నియోజక వర్గంలోని ఓటర్లకు పంచేందుకు  ఆ డబ్బు తెస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.  

నగదు దొరికింది ఈ కారులోనే

జనగామ టిఆర్ఎస్ నేతకు సంబంధించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో పట్టుబడిన వారు ఆ డబ్బుకు సంబంధించిన వివరాలు చూపించమంటే చూపించ లేకపోయారు.