Sonam kapoor: బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజాలకు చెందిన దిల్లీలోని తమ నివాసంలో రూ.2.4కోట్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు తాజాగా ఈ కేసులోని విస్తుపోయే విషయాలను వెల్లడించారు. ఆ దొంగతనం ఎవరో కాదు, తమ ఇంట్లో పనిచేసే నర్సు, ఆమె భర్తే. వారిద్దరూ కలిసి పన్నిన పన్నాగమే ఈ చోరీ అని పోలీసులు చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళితే, అనిల్ కపూర్ ముద్దుల కూతురు సోనమ్ కపూర్, తన భర్త మరియు అతని తల్లిదండ్రులు దిల్లీలోని ఓ విలాసవంతమైన ఇంట్లో నివాసముంటున్నారు. కాగా సోనమ్ కపూర్ గర్భిణీ కావడం, ఆమె తన పుట్టింటికి వెళ్లడంతో కథ మొదలైంది. దాంతో ఆనంద్ తన తల్లి ఆరోగ్యం చూసుకోవడానికి కేర్ టేకర్‌గా అపర్ణ రూతు విల్సన్ అనే ఓ నర్సును నియమించాడు. అయితే పనికి వచ్చిన మొదట్లో ఆమె బాగానే ఉన్నా ఆ తర్వాత మాత్రం తన సొంత తెలివితేటలను ఉపయోగించసాగింది. తిన్నింటి వాసాలను లెక్కించేందుకు సిద్ధమైంది.
దాంతో అనుకున్నదే తడవుగా ఆ నర్సు, తన భర్తతో కలిసి ఆ ఇంట్లో ఉన్న నగలు, డబ్బును కాజేయాలని ప్లాన్ చేశారు. పిబ్రవరి 11వ తేదీ అర్థరాత్రి ఎవరూ లేని సమయంలో తన భర్తను పిలిచిన నర్సు, రూ.2.4కోట్ల నగదును, ఆభరణాలను కాజేశారు. ఆ తర్వాత ఏమీ తెలియదన్నట్టు దాదాపు రెండు నెలలుగా యాక్టింగ్ చేస్తూ రోజూ లాగే పనిలోకి వచ్చేది. అనంతరం ఆ ఇంట్లో దొంగతనం జరిగిందని సోనమ్ కపూర్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసులు తమ విచారణలో భాగంగా ఆ ఇంట్లో పని చేసే పనివాళ్లను ప్రశ్నించడం, వారి ఇళ్లను సోదా చేశారు. అందులో భాగంగా అపర్ణ ఇంటిని కూడా చెక్ చేయగా, సోనమ్ ఇంట్లో మాయమైన నగలు ఆ నర్సు ఇంట్లో ప్రత్యక్షం కావడం చూసి అంతా షాక్ అయ్యారు. దాంతో నర్సు అపర్ణను, అందుకు సహకరించిన ఆమె భర్తనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు కూడా ఈ చోరీ చేసింది తామేనని ఒప్పుకోవడం ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.