టిఆర్ఎస్ హరీష్ రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారు

మెదక్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజవర్గ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాపరెడ్డి సంచలన ప్రకటనలు చేశారు. శనివారం గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా వంటేరు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మీద, మంత్రి హరీష్ రావు మీద తీవ్రమైన కామెంట్స్ చేశారు. టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు తారా స్థాయికి చేరిందని ఆయన విమర్శించారు.

టిఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావును తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అందుకే మంత్రి హరీష్ రావు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. అతి త్వరలోనే హరీష్ రావు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు.

50 రోజుల్లో వంద సభలు పెడతానని బీరాలు పలికిన కేసిఆర్ ఫామ్ హౌస్ కే ఎందుకు పరిమితమయ్యారో చెప్పాలని సవాల్ చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని వంటేరు ధీమా వ్యక్తం చేశారు. 

టిఆర్ఎస్ లో బావా, బామ్మార్ది (హరీష్ రావు, కేటిఆర్) మధ్య కొట్లాట సీరియస్ గా నడుస్తున్నది అని తెలిపారు వంటేరు. హరీష్ రావుకు టిఆర్ఎస్ లో గౌరవం లేదు కాబట్టి అతి త్వరలో హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు అని తెలిపారు. ఇది ముమ్మాటికీ వాస్తవం అన్నారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ సమక్షంలో హరీస్ రావు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు చెప్పారు. 

వంటేరు మీడియాతో మాట్లాడిన వీడియో కింద ఉంది మరిన్ని వివరాల కోసం వీడియో చూడండి. మిగతా స్టోరీ కూడా చదవండి.

vanteru pratap reddy Hot comments on Harish Rao

 

వంటేరు కు పార్టీ కొత్తది కానీ కేసిఆర్ తో వైరం పాతదే

వంటేరు ప్రతాపరెడ్డి రానున్న ఎన్నికల్లో గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేయడం ఖాయమైపోయిందని చెబుతున్నారు. ఆయన గత ఎన్నికల్లో కేసిఆర్ మీద కేవలం 19వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఆయన ఈ నాలుగున్నరేళ్ల కాలంలో టిఆర్ఎస్ సర్కారుపై మడమ తిప్పని పోరాటం చేశారు.

గజ్వేల్ లో 2014 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న తూంకుంట నర్సారెడ్డి లోపాయికారీ ఒప్పందం చేసుకుని టిఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసినట్లు ఇప్పటికీ విమర్శలున్నాయి. ఎన్నికల తర్వాత తూంకుంట కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరారు.

అనంతర కాలంలో నర్సారెడ్డికి టిఎస్ ఆర్డీసి ఛైర్మన్ పదవి కట్టబెట్టారు కేసిఆర్. అయితే ఆయనకు టిఆర్ఎస్ లో ఏమాత్రం గౌరవం, గుర్తింపు లేవని బాధపడుతూ చివరకు మళ్లీ తన సొంత గూటికి చేరారు. 

ఈ పరిస్థితుల్లో 2014లో టిడిపి అభ్యర్థిగా ఉన్న వంటేరు ప్రతాపరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా కేసిఆర్ మీద పోటీ చేయబోతున్నారు. పార్టీ వేరైనా వైరం పాతదే కావడంతో తెలంగాణ, ఎపి జనాల దృష్టి అంతా గజ్వేల్ మీద పడింది. ఇప్పటికే వంటేరు కు టికెట్ ఖాయమని, ఆయనను పని చేసుకోవాలని అధిష్టానం పెద్దలు సూచించినట్లు చెబుతున్నారు.

ఇక వంటేరు తాజాగా తూప్రాన్ లో టిఆర్ఎస్ ను డైలమాలో పడేసే రీతిలో కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. నిజానికి కేసిఆర్, హరీష్ మధ్య రిలేషన్ గతంలో మాదిరిగా ఉన్నాయా లేవా అన్న అనుమానాలు ఒకవైపు కలుగుతున్న తరుణంలో వంటేరు ఈరకమైన ప్రకటన చేయడం సంచలనం రేపింది. 

మరి వంటేరు ప్రతాప రెడ్డి విమర్శలపై మంత్రి తన్నీరు హరీష్ రావు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.