వరంగల్ అర్బన్ కలెక్టర్ గా అందరి మదిలో మెదిలిన ఆమ్రపాలి కాటా కు తెలంగాణ సర్కారు షాక్ ఇచ్చింది. వరంగల్ అర్బన్ కలెక్టర్ గా ఉన్న ఆమెను నిన్న సాయంత్రం బదిలీ చేశారు. ఆమె స్థానంలో ప్రశాంత్ జీవన్ పాటిల్ ను నియమించింది ప్రభుత్వం. ఆమ్రపాలికి నిన్న పోస్టింగ్ ఇవ్వలేదు. 24 గంటల తర్వాత ఆమ్రపాలికి పోస్టింగ్ ఇచ్చారు.
అయితే జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఆమెను జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ గా నియమించింది ప్రభుత్వం. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వరంగల్ కలెక్టర్ గా ఉన్న సమయంలో ఆమ్రపాలి పనితీరు పట్ల తెలంగాణ సర్కారు సంతృస్తిగా లేదన్న వార్తలొచ్చాయి. ఆమె వరంగల్ అర్బన్ కలెక్టర్ గా చేసినా ఆశించిన మేరకు పరిపాలన అందించలేదన్న ఉద్దేశంతో సర్కారు ఉన్నట్లు వరంగల్ టిఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
దీంతో ఆమెను నిన్న బదిలీ చేశారు. కానీ పోస్టింగ్ ఇవ్వలేదు. ఈరోజు పోస్టింగ్ ఇచ్చినా ప్రాధాన్యత లేని పోస్టు కట్టబెట్టారన్న విమర్శలు అప్పుడే మొదలయ్యాయి. అడిషనల్ కమిషనర్ అంటే గతంలో మాదిరిగా కలెక్టర్ గా ఇక్కడ ఫుల్ ఫ్రీడం ఉండే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు.
ఇటీవల కాలంలో ఆమ్రపాలి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సర్కారు పెద్దలకు తలనొప్పి తెచ్చిపెట్టిందన్న చర్చ ఉంది. కలెక్టర్ బంగ్లాలో దెయ్యం ఉందంటూ ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ గదిలో పడుకోవాలంటే తనకు భయంగా ఉందని కూడా అన్నారు. ఈ విషయాన్ని గతంలో పనిచేసిన కలెక్టర్లే తనకు చెప్పారని అన్నారు. జిల్లా కలెక్టర్ గా వ్యవహరించే వ్యక్తి ఇలా మూఢ నమ్మకాలను పెంచిపోశించే విధంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
అధికార పార్టీ నేతలకు అందుబాటులో ఉండకపోవడం కూడా ఆమె పనితీరు పట్ల సర్కారు గుర్రుగా ఉందన్న చర్చ ఉంది. ఈ అన్ని పరిణామాల కారణంగా కలెక్టర్ ఆమ్రపాలి బదిలీ తప్పలేదు. తొలుత వరంగల్ అర్బన్ నుంచి వరంగల్ రూరల్ కు మార్చొచ్చు అన్నారు. కానీ ఆమెను హైదరాబాద్ కు బదిలీ చేసింది సర్కారు.