అమ్రపాలి అనేకన్నా… కలెక్టర్ అమ్రపాలి అంటే వెంటనే తెలిసిపోయింది. ఓ… ఆ కలెక్టరమ్మా.. మంచి అమ్మాయి. ఎక్కడ పనిచేసినా.. అక్కడ సమర్థంగా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నది అని అంటారు కదా. అవును.. నిజమే…చిన్న వయసే అయినా కలెక్టర్ గా తన విధిని సమర్థంగా నిర్వహించి ప్రభుత్వాల మెప్పును కూడా పొందింది అమ్రపాలి. ఆమె పుట్టి పెరిగింది ఏపీలో అయినా.. ఆమెకు ఫ్యాన్స్ ఉన్నది మాత్రం తెలంగాణలో.
ఆమె వికారాబాద్ సబ్ కలెక్టర్ గా, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గా, వరంగల్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఎంతో సమర్థంగా పని చేసి అందరి మన్ననలు పొందారు.
ప్రస్తుతం ఆమె కేంద్ర హోంశాఖ సమాయ మంత్రి కిషన్ రెడ్డికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అయితే.. ఆమెకు ప్రమోషన్ లభించింది. పీఎంవో ఆఫీసులో డిప్యూటీ సెక్రటరీగా ఆమెను నియమించారు. పీఎంవో డిప్యూటీ సెక్రటరీ అంటే ప్రధాని బృందంలో ఉంటారు. ఈ పదవి చాలా కీలకమైనది. చాలా తక్కువ మది ఐఏఎస్ లకే ఈ పదవి దక్కుతుంది. అటువంటి పదవిని అమ్రపాలి దక్కించుకుంది.
అయితే.. అమ్రపాలికి తెలంగాణతో ఉన్న అనుబంధం వల్ల… తెలంగాణ సీఎం కేసీఆర్ ఆమెకు ఫోన్ చేసి అభినందించారట. తెలంగాణలో ఆమె విధులు నిర్వర్తించిన విషయాన్ని సీఎం కేసీఆర్ ఆమెతో పంచుకున్నారట. తెలంగాణలో ఎంతో నిస్వార్థంగా పనిచేసి ప్రజల మనసును గెలుచుకొని ఇప్పుడు ఏకంగా పీఎంవో ఆఫీసుకు ప్రమోషన్ పై వెళ్లడం నిజంగా అభినందనీయం అని సీఎం కేసీఆర్.. అమ్రపాలికి తెలిపారట. సీఎం కేసీఆర్ ఫోన్ చేసి అభినందించడంతో అమ్రపాలి కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారట.