కలెక్టర్ ఆమ్రపాలి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

ఐఏఎస్ ఆమ్రపాలి తెలంగాణ ఎన్నికల కమిషన్ జాయింట్ సీఈవోగా నియమితులయ్యారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ నుంచి బదిలీ అయ్యి జీహెచ్ ఎంసీకి వచ్చారు. జీహెచ్ ఎంసీలో నిండ పది రోజులు పని చేయకముందే ఆమ్రపాలిని తెలంగాణ ఎన్నికల కమిషన్ జాయింట్ సీఈవోగా నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్న సందర్బంలో ఎన్నికల కమిషన్ కు ఐఏఎస్ ల అవసరం ఉంది. ఇటీవలే జీహెచ్ ఎంసీకి బదిలీ అయిన ఆమ్రపాలిని ఎన్నికల కమిషన్ లోకి తీసుకున్నారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ గా సంచలనాలు చేసినా ఆమ్రపాలి జీహెచ్ ఎంసీ లో అప్రాధాన్య పోస్టుకు బదిలీ కావడంతో అంతా ఆశ్చర్య పోయారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ లోకి తీసుకోవడంతో అమ్రపాలికి మంచి పోస్టే దక్కిందని పలువురు చర్చించుకుంటున్నారు.

2014 లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఆమ్రపాలి వికారాబాద్ సబ్ కలెక్టర్ గా ఉన్నారు. ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చాలా చక్కగా పనిచేసి ఆమ్రపాలి అందరి మన్ననలు పొందారు. ఎన్నికల్లో మంచిగ పనిచేసిన అనుభవం ఉండటంతో ఎన్నికల కమిషన్ గుర్తించి జాయింట్ సీఈవో గా తీసుకుందని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు.

తనకు నచ్చినట్టే ఉండి తనకు నచ్చినట్టే చేసి ఆమ్రపాలి వార్తల్లోకెక్కారు. కలెక్టర్ గా ఉన్నప్పుడు ఆమ్రపాలి మోడరన్ దుస్తులు ధరించి అందరిని ఆశ్చర్యపరిచారు. పలువురు విమర్శించినా కూడా తనకు నచ్చినట్టే ఆమ్రాపాలి ఉంది. వరంగల్ నుంచి కావాలనే ఆమ్రపాలి బదిలీ అయ్యిందన్న వార్తలు కూడా వచ్చాయి. జీహెచ్ ఎంసీకి బదిలీ అయినా కూడా ఆమె వెంటనే విధుల్లో చేరలేదు. వారం క్రితమే ఆమె జీహెచ్ ఎంసీలో ఛార్జీ తీసుకున్నారు. ఈ లోపు ఆమ్రపాలిని ఎన్నికల కమిషన్ జాయింట్ సీఈవోగా నియమిస్తూ ఎన్నికల కమిషన్ శుక్రవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది.